ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతుంది. గతంలో ఏ రంగం దూసుకెళ్లని విధంగా రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు కూడా నువ్వా? నేనా అనే రీతిలో పోటీపడుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద స్కూటర్ ప్లాంట్ ఇండియాలో నిర్మాణం జరుపుకోబోతుంది. ఈ మేరకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ ఫ్యాక్టరీలో స్కూటర్ల తయారీ ప్రారంభం కానున్నట్లు తెలపింది.
సింపుల్ ఎనర్జీ
ఓలా రాకతో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. ఓలా లాంచ్ అయిన రోజే సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ ప్రపంచంలోనే ఒకసారి ఛార్జ్ చేస్తే అత్యధిక దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. ఈ కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం.. స్టాండర్డ్ కండీషన్స్‌లో సింపుల్ వన్ ఒక చార్జ్తో 236 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అద్భుతమైన ఫీచర్లు ఉండటానికి తోడు ఈవీ స్కూటర్ బూమ్‌ని అందిపుచ్చుకోవాలని సింపుల్ ఎనర్జీ నిర్ణయించుకుంది. అందులో భాగంగా భారీ ఎత్తున స్కూటర్ల తయారీకి రంగం సిద్ధం చేసింది.
2022 చివరి నాటికి ఉత్పత్తి
ప్రస్తుతం ఓలా సంస్థ తమిళనాడులో కృష్ణగిరి జిల్లాలో 500 ఎకరాల్లో ఓలా స్కూటర్ గిగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. సింపుల్ ఎనర్జీ అంతకంటే పెద్దగా ఏకంగా 600 ఎకరాల్లో గిగా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. గిగా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సింపుల్ ఎనర్జీ సంస్థ సైతం తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మొత్తం రెండు దశల్లో ఆరు వందల ఎకరాల్లో గిగా ఫ్యాక్టరీ నిర్మించనుంది.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి సంబంధించిన గిగా ఫ్యాక్టరీ మొదటి దశ ఉత్పత్తి వచ్చే ఏడాది చివరి నాటికి జరుగుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా రెండో దశ 2023 చివరి నాటికి అందుబాటులోకి రానుంది. మొత్తంగా సింపుల్ వన్ రూ. 2500 కోట్లు పెట్టుబడికి రెడీ అయ్యింది. ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి లభించనుంది.