What is Stamp Duty, Transfer Duty, Registration Fee in Telugu: ఏదైనా ఒక ఆస్తిని ఎవరైనా కొనుగోలు చేసిన తర్వాత, చట్ట ప్రకారం ఆ ఆస్తిని కొనుగోలుదారులు తమ పేరుతో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్(Property Registration) చేయించుకోవాల్సి ఉంటుంది. ఆస్తి లావాదేవీ జరిగినప్పుడు ప్రభుత్వం ప్రాపర్టీ పన్ను(Property Tax) విధిస్తుంది. ఈ పన్నునే ‘స్టాంప్ డ్యూటీ’ అంటారు.
మీరు ప్రాపర్టీని కొనుగోలు చేసిన తర్వాత ఆ ఆస్తిని అమ్మిన వారికి నిర్ణీత ధర చెల్లిస్తే సరిపోతుందని భావించకూడదు. వాటిని మీ పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అదనంగా కొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రాపర్టీపై స్టాంప్ డ్యూటీ(Stamp Duty), రిజిస్ట్రేషన్ ఛార్జీలు(Property Registration charges), సెస్ (SESS) సర్‌చార్జీలు వర్తిస్తాయి.
(ఇది కూడా చదవండి: వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే ఏమిటి? ఖాళీగా ఉన్న భూమిపై పన్ను చెల్లించాలా?)
ఈ అన్ని ఛార్జీలు కలిపి మొత్తం ఆస్తి మార్కెట్ విలువలో 7% నుంచి 10% వరకు లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చు. భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆస్తి మొత్తం మార్కెట్ విలువలో 5-7 శాతాన్ని స్టాంప్ డ్యూటీగా వసూలు చేస్తున్నారు. దీంతోపాటు 1% రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే, ఈ ఛార్జీలు వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు వేరు వేరుగా ఉంటాయి.
స్టాంప్ డ్యూటీ(What is Stamp Duty) అంటే ఏమిటి?
స్టాంప్ డ్యూటీ అనేది భూ లావాదేవీలపై ప్రభుత్వం విధించే పన్ను. మనం ఏదైనా ఒక ఆస్తిని కొనుగోలు చేయగానే ఇక్కడితో ప్రక్రియ పూర్తి కాదు. ఆ ఆస్తికి చట్టపరమైన యాజమాన్యానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ రుజువు కలిగి ఉండాలి. దీని కోసం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు తప్పనిసరిగా చెల్లించాలి.
స్టాంప్ డ్యూటీని ఆస్తి విలువ ఆధారంగా లెక్కిస్తారు. స్టాంప్ డ్యూటీ అనేది మీ మొత్తం ప్రాపర్టీ ధరను పెంచుతుంది. కాబట్టి, ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు ఇలాంటి రుసుములను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
(ఇది కూడా చదవండి: భూములు, ఇండ్ల స్థలాల రిజిస్ట్రేషన్ విలువకు VS మార్కెట్ విలువకు తేడా ఏంటి?)
ఇండియన్ స్టాంప్ యాక్ట్- 1899లోని సెక్షన్ 3 ఏం చెబుతోంది?
ఆస్తి టైటిల్‌ను ఇతరుల పేరు మీదకు బదిలీ చేస్తున్నప్పుడు ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తులను కొనుగోలు చేసినవారు ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రుసుమును వసూలు చేస్తాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఇండియన్ స్టాంప్ యాక్ట్-1899లోని సెక్షన్ 3 ప్రకారం.. ఆస్తిని రిజిస్టర్ చేసేటప్పుడు మీరు స్టాంప్ డ్యూటీని చెల్లించాలి.
మీ రిజిస్ట్రేషన్ ఒప్పందాన్ని ధ్రువీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుంది. స్టాంప్ డ్యూటీ చెల్లించిన ట్యాగ్ ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్.. కోర్టులో ఆస్తిపై మీ యాజమాన్యాన్ని నిరూపించడానికి చట్టపరమైన పత్రంగా పనిచేస్తుంది. స్టాంప్ డ్యూటీ ఛార్జీలు చెల్లించకుండా, ఆ ఆస్తిని చట్టబద్ధంగా తమ సొంతమని క్లెయిమ్ చేయలేరు. కాబట్టి కొనుగోలుదారులు స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని తప్పనిసరిగా చెల్లించాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు (What is Registration Fee) అంటే ఏంటి?
రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ రెండింటినీ వేర్వేరుగా లెక్కిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కోర్టు వసూలు చేసే రుసుము. ఇది రిజిస్ట్రేషన్ చట్టం కిందకు వస్తుంది. ఇది ప్రాథమికంగా కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య టెర్మినల్ లీగల్ ఒప్పందం.
ఆస్తిపై యాజమాన్యం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మారిందనే నోట్‌ను ఈ లీగల్ అగ్రిమెంట్ కలిగి ఉంటుంది. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్-1908లోని సెక్షన్ 17 ప్రకారం.. ఆస్తుల బదిలీ, అమ్మకం, లీజు వంటి ఒప్పందాలు జరిగితే, తప్పకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్ పీజు కూడా రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది.