Home Buying Guide, Tips, Precautions: మన దేశంలో ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని అనేది ఒక కల. దానికోసం వారు పైసాపైసా కూడబెట్టి ఇల్లు కొనుక్కోవాలని లేదా స్థలం కొని కట్టుకోవాలని చూస్తారు. అయితే, ఇల్లు అనేది మన సుదీర్ఘమైన కల కాబట్టి దానిని కొనే ముందు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
లేకుంటే, కొనుగోలుదారులకు తీరని నష్టం జరిగే అవకాశం ఉంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఇల్లు కొనుగోలు అనేది మన జీవితంలో పెద్ద విషయం.. కాబట్టి ఈ ప్రక్రియలో ఏదైనా పొరపాటు జరిగితే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
(ఇది కూడా చదవండి: ఓపెన్ ప్లాట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!)
అందుకే, ఇండిపెండెంట్ హౌస్, బిల్డర్ లేదా రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ఇల్లు కొనుగోలు చేసే ముందు పలు డాక్యుమెంట్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు పరిశీలించాల్సిన ప్రధాన డాక్యుమెంట్లు ఏమిటో తెలుసుకుందాం..
ఇల్లు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
సేల్ డీడ్ (అమ్మకపు దస్తావేజు):
ఏదైనా ఒక ఆస్తి కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ చూడాల్సిన పత్రాలలో సేల్ డీడ్ అనేది చాలా ముఖ్యం. ఇది ఆ ఆస్తికి సంబంధించి గత యజమాని ఏ వ్యక్తి నుంచి ఆ ఆస్తిని కొనుగోలు చేశారో తెలియజేస్తుంది. ప్రాపర్టీ అమ్మకానికి ఈ డీడ్ అనేది తప్పనిసరి అనే విషయం మనం గుర్తుంచుకోవాలి.
అలాగే, మీరు ఇల్లు కొనేటప్పుడు ఈ సేల్ డీడ్ కింద దరఖాస్తు చేసుకోవాలి. దీనిలో కొనుగోలుదారు, విక్రేత మధ్య అంగీకరించినట్లు వివిధ నిబంధనలు షరతులను ఇందులో పేర్కొంటారు. దీనిలో అమ్మే వ్యక్తి, కొన్న వ్యక్తి పూర్తి వివరాలు ఇవ్వడంతో పాటు ఒప్పందం మీద రెండు పార్టీల సంతకం చేసి ఇస్తారు.
మదర్ డీడ్:
ఒక ఆస్తి యాజమాన్య హక్కులను గుర్తించే ఒక ముఖ్యమైన చట్టపరమైన పత్రం(ఆస్తి అప్పటికే వివిధ యజమానులను కలిగి ఉంటే). మీకు గనుక మదర్ డీడ్ లభించకపోతే ఆ ఆస్తికి సంభందించిన సర్టిఫికేట్ కాపీలను సంభందిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి పొందవచ్చు.
బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్:
ఇల్లు నిర్మించే ముందు దాని యజమాని స్థానిక మున్సిపల్ కమిషనర్ లేదా అలాంటి కమీషనర్ అధికారం కలిగిన ఇతర అధికారి నుంచి బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ ఆమోదం పొందవలసి ఉంటుంది. బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ ఇచ్చే అధికారం అనేది మీరు ఉండే ప్రాంతం బట్టి మారుతూ ఉంటుంది.
ఒక ఇంటికి బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ ఇచ్చే ముందు జోనల్ వర్గీకరణ, రహదారి వెడల్పు, నేల ప్రాంత నిష్పత్తి(FAR) మరియు ప్లాట్ లోతు వంటివి అధికారులు చెక్ చేస్తారు. భవనం ఆమోదం ప్రణాళికను పొందడానికి యజమాని అందుకు తగిన పత్రాలను సమర్పించాలి.
(ఇది కూడా చదవండి: వ్యవసాయ భూములు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి..?)
ఒకవేళ బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ లేని ఇంటిని మీరు కొనుగోలు చేయాలని చూస్తే భవిష్యత్తులో చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవలసి ఉంటుంది. అది భవన కూల్చివేతకు కూడా దారి తీసే అవకాశం ఉంది. ఇలాంటి గృహాలను కొనుగోలు చేయడానికి బ్యాంకులు గృహ రుణాలను మంజూరు చెయ్యవు. అందుకే ఇల్లు కొనే ముందు ఈ అనుమతులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి.
లాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ (వ్యవసాయ భూమి నుండి వ్యవసాయేతర మార్పిడి):
ఒక ఇంటిని నిర్మించాలి అంటే ఆ భూమి వ్యవసాయేతర భూమి కావాల్సి ఉంటుంది. అలా కాకుండా వ్యవసాయ భూమిలో ఇల్లు నిర్మించేతే అది చట్టరీత్యా నేరం. ఒకవేళ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు ఉపయోగించడం కోసం ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి.
ఇలాంటి సర్టిఫికేషన్ కోసం భూ యజమానులు సంభందిత భూమి డెవెలప్మెంట్ కు సంభందించిన కొన్ని రకాల పత్రాలను సమర్పిస్తే ప్రభుత్వ రికార్డుల్లో అక్కడి భూమికి ఉన్న మార్కెట్ వాల్యూ లెక్కల ప్రకారం కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తే ఈ సర్టిఫికెట్ పొందవచ్చు. ఇలాంటి సర్టిఫికేషన్ లేని భూముల్లో ఉన్న ఇళ్లను ఏ పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దు.
ఎన్కంబన్స్ సర్టిఫికేట్ (EC):
ఈ సర్టిఫికేట్లో ఒక ఆస్తికి సంభందించిన పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. ఆ ఆస్తి ఎవరి పేరున ఉంది? సదరు యజమాని సంబందించిన ఆస్తిపై ఏదైనా ఋణం తీసుకున్నాడా? అనే వివరాలు ఉంటాయి. ECలో ఆ ఆస్తిపై అప్పటివరకు జరిపిన అన్ని లావాదేవీలు నమోదై ఉంటాయి.
ఆస్తి కొనుగోలు/అమ్మకం, ఏ ఇతర లావాదేవీ లేదా తనఖా స్థితిని స్పష్టంగా తెలియజేసే ఒక నిర్దిష్ట ప్రమాణపత్రం ఇది. అది ఇల్లైనా, లేదా స్థలమైనా ఏదైనా సరే ఆస్తిని కొనుగోలు చేసే ముందు ECని తప్పకుండా చెక్ చేయాల్సి ఉంటుంది.
పవర్ ఆఫ్ అటార్నీ(POA):
POA అనేది అతని / ఆమె తరపున ఆస్తి యజమాని మరొక వ్యక్తికి అధికారం ఇవ్వడానికి ఉపయోగించే చట్టపరమైన ప్రక్రియ. ఒకరి ఆస్తిపై తమకున్న హక్కును ఇతరులకు బదిలీ చేయడానికి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ(SPA) లేదా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA) వినియోగించుకుంటారు.
(ఇది కూడా చదవండి: తెలంగాణ ధరణి పోర్టల్‌లో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంతో తెలుసా?)
జీపీఏ అధికారం గల భూములలో నిర్మించిన ఇంటిని కొనుగోలు చేసే ముందు న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఈ మధ్య కాలంలో ఇటువంటి వాటిలో నిర్మించిన ఇళ్ల విషయంలో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి.
తాజా పన్ను చెల్లింపు రసీదులు:
ఆయా ఆస్తులకు సంభందించి కొనుగోలుదారు తాజాగా పన్ను చెల్లించిన రశీదులు మరియు బిల్లుల కోసం అమ్మే వ్యక్తిని అడగాలి. యజమాని పేరు, పన్ను చెల్లించేవారి పేరు, రసీదు చెల్లింపు తేదీ వివరాలను పూర్తిగా చెక్ చేయాల్సి ఉంటుంది.
యజమాని పన్ను రశీదును కలిగి ఉండకపోతే, కొనుగోలుదారు భూమి యాజమాన్యాన్ని ధృవీకరించడానికి ఆస్తి సర్వే సంఖ్యతో మునిసిపల్ శాఖను సంప్రదించవచ్చు. అప్పటివరకు ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే వాటిని పూర్తి చేసే భాద్యత కూడా సంభందిత యజమానిదే అనే విషయం మనం గుర్తుంచుకోవాలి.
పూర్తి సర్టిఫికెట్(certificate of completion construction):
భవనం నిర్మాణం పూర్తయ్యాక పొందే సర్టిఫికెట్ ఇది. భవనం దాని ఎత్తుల పరంగా, రహదారి నుండి దూరం, ఆమోదించబడిన ప్రణాళికల ప్రకారం నిర్మించినట్టు మున్సిపల్ అధికారులు ఇచ్చే ఒక పూర్తి సర్టిఫికెట్. ఈ పత్రం ఆస్తి కొనుగోలు సమయంలో ముఖ్యమైనది, హోమ్ లోన్ కోసం కూడా ఇది చాలా ముఖ్యమైన పత్రం.
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(occupancy certificate):
బిల్డర్లకు ఆయా పరిధిలోని సంభందిత మునిసిపల్ అధికారులు ఇచ్చే ఒక సర్టిఫికెట్ ఇది. ఈ సర్టిఫికేట్ కోసం బిల్డర్ అధికారులను సంప్రదించినపుడు ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని నిబంధనలకు అనుగుణంగా ఇంటిని నిర్మించినప్పుడు మాత్రమే ఈ సర్టిఫికెట్ జారీ చేస్తారు.
అలా నిర్మించకపోతే భవనం నిర్మించిన యజమానికి భారీ ఎత్తున జరిమాణాలూ ఉంటాయి. మీరు ఒక బిల్డర్ దగ్గర ఇంటిని కొనే ముందు ఈ సర్టిఫికెట్ ఉందా లేదా అని నిర్దారించుకోవాలి. సర్టిఫికెట్ లేకపోతె హోమ్ లోన్స్ దొరకడం కష్టం.
నిర్మాణ క్లియరెన్స్ సర్టిఫికేట్:
మీరు డెవలపర్ నుంచి ఇల్లు వంటి ఆస్తిని కొనుగోలు చేస్తుంటే నిర్మాణ క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం. ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం ఇంటిని నిర్మించినప్పుడు మాత్రమే స్థానిక అధికారులు ఈ నిర్మాణ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు.