Pradhanmantri Suryoday Yojana Scheme: అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 22న కొత్త పథకాన్ని ప్రకటించారు. ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’(Pradhanmantri Suryodaya Yojana) పేరుతో ప్రకటించిన ఈ పథకం ద్వారా దేశంలో కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ వెలుగులు నింపనున్నట్లు మోడీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
సూర్యవంశీయుడైన శ్రీరాముడి దివ్య ఆశీస్సులతో.. కోటి మంది ఇళ్ల పైకప్పుపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని జనవరి 22 సాయంత్రం ప్రధాని మోదీ ప్రకటించారు. అయోధ్య నుంచి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్న వెంటనే.. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ (Pradhanmantri Suryodaya Yojana) పథకంపై మంత్రులు, అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు.
(ఇది కూడా చదవండి: Lakshadweep Tourism: లక్షద్వీప్ ఎలా చేరుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది?)
కోటి ఇళ్లపై అమర్చనున్న సోలార్ ప్యానెళ్ల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘సూర్యవంశీయుడైన భగవంతుడు శ్రీరాముని కాంతి నుంచి ప్రపంచలోని భక్తులందరూ ఎప్పుడూ శక్తిని పొందుతారు. ఈ రోజు అయోధ్యలో పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించిన సందర్భంగా.. దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థను కలిగి ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇది’ అని ప్రధాని మోదీ తెలిపారు.
ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజల కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చనున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘దేశంలో 1 కోటి ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ప్రారంభించినట్లు’ ప్రధాని మోదీ పోస్టు చేశారు.
(ఇది కూడా చదవండి: Personal loan: పర్సనల్ లోన్ తీసుకుంటే క్రెడిట్‌స్కోరు దెబ్బతింటుందా?)