Honda Unveils Activa Electric Scooters: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటార్‌సైకిల్ ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. Activa QC1, Activa e పేరుతో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌లో బ్యాటరీ మార్చుకొనే సౌకర్యం కూడా ఉంది. హోండా తన పాపులర్ స్కూటర్ పేరును కొనసాగిస్తూ యాక్టివా ఈ (Honda Activa e)ని తీసుకొచ్చింది.
Honda Activa e Electric Scooter:
ఈ Honda Activa e స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, సైడ్ ఇండికేటర్ల విషయంలో చిన్న చిన్న మార్పులు చేశారు. ఇందులో రెండు 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీలను అమర్చారు. సింగిల్ ఛార్జ్‌తో 102 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ చెబుతోంది. టాప్‌స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. స్టాండర్డ్, స్పోర్ట్, ఎకానమీ పేరుతో మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తోంది.
Honda Activa QC1 Electric Scooter:
హోండా క్యూసీ 1ను భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా కంపెనీ తీసుకొచ్చింది. తక్కువ దూర ప్రయాణాల కోసం దీన్ని డిజైన్ చేశారు. ఇది యాక్టివాను పోలి ఉన్నప్పటికీ.. ఇందులో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ను ఇవ్వలేదు. ఇందులో 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. ఇది ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 50 కిలోమీటర్లు. 5 అంగుళాల ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంటల్ ప్యానెల్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లను అందిస్తోంది.
ఈ రెండు స్కూటర్లకు సంబంధించిన బుకింగ్స్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ధరల వివరాలు సైతం అప్పుడే వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరుకు దగ్గర్లోని తన ప్లాంట్‌లో హోండా ఈ స్కూటర్లను తయారు చేస్తుంది.