Saturday, January 4, 2025
HomeGovernmentTelanganaధరణి Vs భూ భారతి: చట్టాల మధ్య ఉన్న ప్రధాన తేడాలు తెలుసా?

ధరణి Vs భూ భారతి: చట్టాల మధ్య ఉన్న ప్రధాన తేడాలు తెలుసా?

Dharani Vs Bhu Bharathi: తెలంగాణలో నివసిస్తున్న రైతులకు ధరణి వల్ల కలిగిన భాదల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గత బీఆర్ఎస్ 2020లో తీసుకొచ్చిన ధరణి వల్ల మేలు ఎంత జరిగిందో అంతకంటే చెడు జరిగింది. ధరణి పేరు చెబితేనే కొందరి రైతుల గుండెల్లో భాద, కోపం ఒకేసారి కలుగుతాయి.

ధరణి రావడం వల్ల అనేక కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ధరణి తీసుకొని రావడం వల్లఆ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్లు తయారయ్యింది పరిస్థితి. ధరణి వల్ల అన్నీ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ROR-2024(భూ భారతి) పేరుతో ఒక నూతన చట్టం తీసుకొని వచ్చింది.

ఎలా సాయం పొందాలో తెలియని సామాన్య రైతులకు కూడా ఉచిత న్యాయసహాయాన్ని ప్రభుత్వమే అందించేలా ఈ కొత్త ఆర్వోఆర్‌-2024 చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొనివచ్చింది. ఈ చట్టంలో ఎసైన్డ్‌ భూములకు పాసుపుస్తకాలు, ఇనాం భూములకు హక్కులు, పార్ట్‌-బీలో చేర్చిన భూముల సమస్యల పరిష్కారానికి దారిచూపింది. ఈ ఆర్వోఆర్‌-2020(ధరణి), ఆర్వోఆర్‌-2024(భూ భారతి) చట్టాల మధ్య ఉన్న సారూప్యతలు, వ్యత్యాసాలు, కొత్తగా పొందుపర్చిన సెక్షన్లు, రద్దయిన వాటిపై గురుంచి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కొత్త పాసుపుస్తకాలు జారీ

2017 సెప్టెంబరు ముందు వరకు పట్టా ఉండి.. భూదస్త్రాల ప్రక్షాళన, ఆ తర్వాత వచ్చిన ఆర్వోఆర్‌ చట్టం-2020 కొత్త పాసుపుస్తకం రాని.. కనీసం ధరణిలో పేరు, భూమి వివరాలు కూడా లేని రైతులకు.. ఈ కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే పాసుపుస్తకం అందే అవకాశం ఏర్పడింది. అధికారులు చేసిన తప్పుల కారణంగా ఇప్పటి వరకు పాసు పుస్తకాలు రాని రైతులకు కూడా.. ఈ కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది.

- Advertisement -

ధరణి Vs భూభారతి సేవలు

ఆర్వోఆర్‌ – 2020(ధరణి): ఈ చట్టం ద్వారా ధరణి పోర్టల్‌ అమలులోకి తీసుకొని వచ్చారు. దీనివల్ల ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్, వారసత్వ బదిలీ, బహుమతి, మార్టిగేజ్, నాలా, భాగ పంపిణీ సేవలు అందించేవారు. కానీ, అభ్యంతరాలకు అవకాశం కల్పించలేదు.

ఆర్వోఆర్‌ – 2024(భూ భారతి): ధరణి పోర్టల్‌ పేరును భూ-భారతిగా మార్చారు. వారసత్వ బదిలీ మినహా అన్ని లావాదేవీల్లో ఏక కాల రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌ సేవలు యథాతథంగా ఉంటాయి. మ్యుటేషన్‌పై అభ్యంతరాలుంటే ఆప్పిళ్ళు చేసుకునే అవకాశం ఈ కొత్త చట్టంలో ఉంది.

పట్టా భూముల సమస్యలకు పరిష్కారం:

ఆర్వోఆర్‌ – 2020(ధరణి): ధరణిలో ఉన్న భూములకు సంబంధించి మాత్రమే లావాదేవీలు జరిపేందుకు అర్హత ఉండేది. ఆ భూములకు మాత్రమే పాసుపుస్తకాలు జారీ చేసేవారు. 2017-18లో చేపట్టిన దస్త్రాల ప్రక్షాళనతో స్పష్టత వచ్చిన భూముల సమాచారాన్ని మాత్రమే పాత ధరణిలోకి నిక్షిప్తం చేశారు. సమస్యలకు పరిష్కారం కోసం ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయలేదు.

ఆర్వోఆర్‌ – 2024(భూ భారతి): పోర్టల్లో సమాచారం ఉన్న భూముల లావాదేవీలకు అనుమతి ఇస్తారు. సాగులో ఉండీ హక్కులు రాని దాదాపు 8 లక్షల ఎకరాలకు చెందిన రైతులకు హక్కులు కల్పిస్తారు. ఆర్వోఆర్‌-1971 కింద పాసుపుస్తకాలు ఉన్నవారికి కొత్త చట్టంలో హక్కులు జారీ చేస్తారు. సర్వే నంబర్లలో తప్పులు, ఖాతాల్లో తేడాలు, రికార్డులకు భిన్నంగా సాగు వేరేచోట ఉండటం తదితర సమస్యలు ఉన్నప్పటికీ వాస్తవ సాగుదారుల పేరిట హక్కులు కల్పించనున్నారు.

పార్ట్‌-బీ భూముల వివాదాలకు స్వస్తి:

ఆర్వోఆర్‌ – 2020(ధరణి): భూ దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా హక్కుల్లో వివాదాలు ఉన్న భూములను పార్ట్‌-బీ కింద పక్కన పెట్టారు. కాలక్రమంలో విచారణ జరిపి పరిష్కారం కల్పించాలని నిర్దేశించినప్పటికీ చట్టంలో ఆ మేరకు అధికారాలు కల్పించకపోవడంతో సమస్యలు పరిష్కారానికి ఎలాంటి అవకాశం లేదు.

- Advertisement -

ఆర్వోఆర్‌ – 2024(భూ భారతి): పార్ట్‌-బీ కింద 18 లక్షల ఎకరాల భూములు ఉన్నట్లు అంచనా. చిన్న చిన్న వివాదాలు, హద్దుల సమస్యలు, మ్యుటేషన్‌పై ఫిర్యాదులు, సర్వే లోపాలు లాంటి వాటిపై క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ జరుపుతారు. దీనికోసం 3 రకాల పరిష్కార మార్గాలను కల్పించారు.

సులభతరంగా ఉన్న సమస్యలను తహసీల్దారు స్థాయిలో, మధ్యస్తంగా ఉన్నవి ఆర్డీవో, తీవ్రస్థాయివి కలెక్టర్‌ స్థాయిలో పరిష్కరించేలా సెక్షన్లు ఏర్పాటు చేశారు. 23 రకాల భూ యాజమాన్యాలకు సంబంధించి పరిష్కారాలు చూపుతారు. అభ్యంతరాలు తలెత్తితే అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.

వారసత్వ బదిలీ సమస్యలకు పరిష్కారం:

ఆర్వోఆర్‌ – 2020(ధరణి): వారసత్వ బదిలీకి కుటుంబ సభ్యుల ఉమ్మడి అంగీకార పత్రం, సభ్యుల హాజరు తప్పనిసరి చేసినా.. అధికారులకు నోటీసుల జారీచేసే అధికారం కల్పించలేదు. దీంతో స్లాటు నమోదు చేసుకుంటే చాలు.. వారసత్వ బదిలీ సులభంగా పూర్తయ్యేది. ఈ క్రమంలో ఇతర కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు ఎక్కువగా వచ్చేవి.

ఆర్వోఆర్‌ – 2024(భూ భారతి): ఈ చట్టంలో వారసత్వ బదిలీ విషయంలో కుటుంబ సభ్యులకు తహసీల్దారు నోటీసు జారీ చేసి, విచారణ జరిపి మ్యుటేషన్‌ ఉత్తర్వు జారీ చేస్తారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే అప్పీలు చేసుకోవచ్చు.

ఎసైన్డ్‌ భూములకు పట్టాలు జారీ:

ఆర్వోఆర్‌ – 2020(ధరణి): క్షేత్రస్థాయి విచారణ లేకపోవడంతో ఎసైన్డ్, లావుణీ భూములకు స్పష్టత ఉన్నదని భావించిన చోట మాత్రమే పాసుపుస్తకాలు జారీ చేసేవారు.

- Advertisement -

ఆర్వోఆర్‌ – 2024(భూ భారతి): లావుణీ, ఎసైన్డ్‌ తదితర భూములు 24 లక్షల ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వ అంచనా. వీటికి గతంలో పాసుపుస్తకాలు జారీ కాలేదని గుర్తించారు. తాజా చట్టంలో రైతులు దరఖాస్తు చేసుకోకున్నా.. పట్టా పాసుపుస్తకాలు జారీ చేసేవారు. వివాదాలు ఉంటే విచారణ జరిపి పాసుపుస్తకం ఇస్తారు.

సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం:

ROR – 2020(ధరణి): యజమాని పేరున మాత్రమే రికార్డు కొనసాగుతుంది. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు.

ROR – 2024(భూ భారతి): ఒక భూమిని ఇద్దరు అన్నదమ్ములు సాగు చేస్తున్నారనుకుంటే.. భూమి ఒకరి పేరుపై ఉన్నప్పటికీ ఇద్దరూ సాగులో ఉండటాన్ని నిర్ధారించే విధానం పాత చట్టంలో లేదు. ఇలాంటి సందర్భాల్లో న్యాయపరమైన సమస్యలు ఏర్పడుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త చట్టంలో కాస్తు కాలమ్‌ ఏర్పాటు చేశారు. సాదాబైనామాలతో కొనుగోలు చేసిన 9.35 లక్షల ఎకరాల భూములను ప్రస్తుతం సాగులో ఉన్న అర్హులైన రైతుల పేరుతో క్రమబద్ధీకరించేందుకు మార్గం సుగమం అవుతుంది.

అధికారులపై చర్యలు:

ఆర్వోఆర్‌ – 2020(ధరణి): తప్పులు చేసినా, రికార్డులు దిద్దినట్లు తేలినా తహసీల్దారుపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారు. పాసుపుస్తకాల రద్దు అధికారం జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. అప్పీలుకు అవకాశం లేదు.

ఆర్వోఆర్‌ – 2024(భూ భారతి): క్రిమినల్, శాఖాపరమైన చర్యలు పాత చట్టంలోలానే యథాతథంగా కొనసాగుతాయి. పాసుపుస్తకాల రద్దు అధికారం ఆర్డీవోకు అప్పగించారు. చర్యలపై అప్పీళ్లకు కూడా అవకాశం కల్పించారు.

ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు:

ఆర్వోఆర్‌ – 2020(ధరణి): తహసీల్దారు, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌ స్థాయుల్లో ఉన్న రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. ఈ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో తాత్కాలిక ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేశారు. వాటి బాధ్యతలు పూర్తి కాగానే ట్రైబ్యునళ్ల కాలపరిమితి ముగిసింది.

ఆర్వోఆర్‌ – 2024(భూ భారతి): శాశ్వత ల్యాండ్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తారు. భూ వివాదాల పరిష్కారానికి ఆర్డీవో, కలెక్టర్‌ స్థాయిలో అప్పీళ్ల వ్యవస్థలు ఏర్పాటవుతాయి. అప్పీళ్ల వ్యవస్థల పరిధిని దాటిన కేసులను వివిధ స్థాయిల్లోని ల్యాండ్‌ ట్రైబ్యునళ్లకు బదిలీ చేస్తారు.

పహాణీ:

ఆర్వోఆర్‌ – 2020(ధరణి): 32 కాలమ్స్‌తో ఉన్న పహాణీని రద్దు చేశారు. భూ యజమాని పేరుతో ఒకే ఒక కాలమ్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సాగు చేస్తూ ఉండి యజమానులై ఉన్నప్పటికీ పట్టాలు రాని వారి గుర్తింపునకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

ఆర్వోఆర్‌ – 2024(భూ భారతి): 11 కాలమ్స్‌తో పహాణీ పునరుద్ధరించారు. భూ యజమాని, తండ్రి పేరు, యాజమాన్యం రకం (పట్టా/ప్రభుత్వ భూమి/దేవాదాయ/వక్ఫ్‌ తదితర), భూమి రకం (మాగాణి/తరి), సంక్రమించిన విధానం (వారసత్వం/కొనుగోలు), కాస్తు కాలమ్‌ (సాగుదారుడు, పట్టాదారుడు) లాంటి వివరాలు తెలిసేలా ఏర్పాటు చేస్తారు.

భూ ఖాతాలకు రక్షణ

ఆర్వోఆర్‌ – 2020(ధరణి): భూమి ఖాతా, సర్వే సంఖ్యతో పాటు పాసుపుస్తకంపై బార్‌ కోడ్‌ ఏర్పాటు చేశారు. ఫోన్‌ నంబరుకు వచ్చే సంక్షిప్త సందేశం, ఆధార్‌ నంబరు ఆధారంగా లావాదేవీలు నిర్వహించేవారు.

ఆర్వోఆర్‌ – 2024(భూ భారతి): ప్రత్యేకంగా ప్రతి ఖాతాకు తాత్కాలిక, శాశ్వత పద్ధతుల్లో భూధార్‌ సంఖ్య కేటాయిస్తారు. అక్షాంశాలు, రేఖాంశాలతో సర్వే పూర్తయిన అనంతరం శాశ్వత భూధార్‌ కేటాయిస్తారు. భూమి ఖాతా, సర్వే సంఖ్య, బార్‌ కోడ్‌ కొనసాగిస్తారు. ఆధార్‌ నంబరు, ఫోన్‌ నంబరుకు వచ్చే సంక్షిప్త సందేశం ఆధారంగా తాత్కాలిక భూదార్ కేటాయిస్తారు.

ప్రతి భూమికి సర్వే భూమి పటం:

ఆర్వోఆర్‌ చట్టం-2020: ఈ చట్టంలో ఎలాంటి అవకాశం లేదు.

ఆర్వోఆర్‌ చట్టం-2024: భూమి లావాదేవీ సందర్భంగా భూ దస్త్రాలతో పాటు భూమి సర్వే, సబ్‌-డివిజన్‌ పటం జోడించడం తప్పనిసరి. క్రమంగా భూముల సర్వే కూడా ఈ విధానంలో పూర్తవుతుంది. రెండేసి, తప్పుడు రిజిస్ట్రేషన్లకు చెల్లుచీటీ పడుతుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles