Bounce Infinity E1 Electric Scooter: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. వారానికి ఒక కొత్త ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్లోకి వస్తుంది. తాజాగా బెంగళూరుకు చెందిన మొబిలిటీ సంస్థ బౌన్స్ భారత మార్కెట్లలోకి సరికొత్త ‘బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1’ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ బైక్ రెంటల్ సర్వీసెస్‌తో పరిచయమైన బౌన్స్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీగా బౌన్స్ నిలిచింది.
(చదవండి: పెట్రోల్, డీజిల్ మీద కేంద్రం విధిస్తున్న పన్ను తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!)
దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఛార్జ్ జీరో అవ్వగానే ఆయా స్వాపింగ్ స్టేషన్ల నుంచి ఫుల్ ఛార్జ్ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. దేశవ్యాప్తంగా 3500 బ్యాటరీ స్వాపింగ్ సర్వీస్ స్టేషన్లను పార్క్ ప్లస్ భాగస్వామ్యంతో బౌన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. బ్యాటరీ, ఛార్జర్‌తో కూడిన బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ ఈ1 ధర రూ.68,999(ఢిల్లీ ఎక్స్-షోరూమ్), కాగా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్‌లో స్కూటర్‌ను తీసుకుంటే ఈ స్కూటర్ ధర రూ.45,099(ఢిల్లీ ఎక్స్-షోరూమ్)గా ఉంది. బ్యాటరీ లేకుండా సరసమైన ధరకు బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు.

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్టీ రెడ్, స్పార్కిల్ బ్లాక్, పెరల్ వైట్, డెసాట్ సిల్వర్, కామెడ్ గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్ నెట్‌వర్క్ నుంచి రూ.499 చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కూటర్లను కంపెనీ వచ్చే ఏడాది మార్చి నుంచి డెలివరీలను చేపట్టనుంది. ఈ స్కూటర్ కొనుగోలుపై ఫేమ్-2 పథకం కూడా వర్తించనుంది. కొనుగోలుదారులకు 50వేల కిమీలతోపాటు, 3 సంవత్సరాల వారంటీను కంపెనీ అందిస్తోంది.

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌లో వాటర్‌ప్రూఫ్ IP67 రేటెడ్ 48V బ్యాటరీ 39AHతో వస్తుంది, ఇది 83Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 65కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 40 కెఎమ్‌పీహెచ్ వేగాన్ని 8 సెకన్లలో అందుకోగలదు.