రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. అలాగే, ఈ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జింగ్ చేసుకుంటే ఎంత ధర చెల్లించాలో కూడా నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనలను ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ప్రతి కిడబ్ల్యుహెచ్‌కు రూ.12.06 + జిఎస్టీ చెల్లించి ఛార్జ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ కొత్త ధరలు వచ్చే ఏప్రిల్ నెల నుంచి అమలులోకి రానున్నాయి.
(చదవండి: ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. టెస్లాకు గుడ్‌బై?)
అలాగే, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలో వాట్‌కు రూ.15 వేల చొప్పున సబ్సిడీని అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్‌కో) పేర్కొంది. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ తేడా లేకుండా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపింది. రూ.10 లక్షల విలువైన వాహనాల వరకూ సబ్సిడీ ఉంటుందన్నారు.
ఫేమ్ 2 స్కీమ్ కింద హైదరాబాద్ అంతటా సుమారు 118పబ్లిక్ వేహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వరంగల్, కరీంనగర్ పట్టణాలలో మరో 20 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సంఖ్య మొత్తం 138కి చేరుకోనుంది. ఈ ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ వచ్చే మార్చి నాటికి సిద్ధం కానున్నాయి.