Ola Electric Scooter: దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చే సమయం ఆసన్నమైంది. నేటి(సెప్టెంబర్ 8) నుంచి ఓలా స్కూటర్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవాలని అనుకునేవారి కోసం ఈఎంఐ సౌకర్యాన్ని కూడా పలు బ్యాంకులు అందిస్తున్నాయి.
ఇంతక ముందు ప్రీ బుకింగ్ చేసుకున్న వారు సెప్టెంబరు 8 నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి బైక్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తం సొమ్ము చెల్లించి లేదా ఈఎంఐ పద్దతిలో స్కూటర్‌ని కొనుగోలు చేయవచ్చు.
ఈఎంఐ ఆప్షన్
ఓలా స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం పలు బ్యాంకులతో ఓలా సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ మహీంద్రా ప్రైమ్, టాటా క్యాపిటల్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, జన స్మాల్ ఫైనాన్స్ వంటి పలు బ్యాంకింగ్ , ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా కనీస ఈఎంఐ రూ.2,999గా నిర్ణయించారు.(చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్!)
అక్టోబరు నుంచి డెలివరీ
నేటి(సెప్టెంబరు 8) నుంచి ఓలా వెబ్‌సైట్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన వారికి అక్టోబరులో డెలివరీ చేస్తామని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెటింగ్ చీఫ్ వరుణ్ దుబే తెలిపారు. షోరూం వ్యవస్థ లేకపోవడంతో నేరుగా కస్టమర్ల ఇంటికే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు డెలివరీ చేయనున్నట్లు తెలిపారు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి విపరీతమైన డిమాండ్ ఉండటంతో చిప్‌ల కొరత వేధిస్తోంది అని అన్నారు. దీంతో బైక్‌ను కొనుగోలు చేసే సమయంలోనే వారికి డెలివరీ ఎప్పుడిస్తామనే వివరాలు కస్టమర్‌కి వెల్లడిస్తామని ఓలా ప్రతినిధులు తెలిపారు.