రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో పోటీ వాతావరణం వేడెక్కిపోతుంది. ఇప్పటికే, దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటే, మరో వైపు స్టార్ట్ అప్ సంస్థలు తమ సత్తా నిరూపించుకునేందుకు సిద్ద పడుతున్నాయి. తాజాగా ముంబైకి చెందిన రాఫ్ట్ మోటార్స్(Raft Motors) అనే మరో కంపెనీ ఇండస్ ఎన్ఎక్స్(Indus NX) పేరుతో మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ ఏడాది నవంబర్ 2వ తేదీన విడుదల చేయడానికి సిద్దం అవుతుంది.

అయితే, ఈ స్కూటర్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అంతర్జాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ స్కూటర్ ఫీచర్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇండస్ ఎన్ఎక్స్(Indus NX) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 480 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ తెలుపుతుంది. ఈ స్కూటర్లలో ఎకో మోడ్, స్పీడ్ మోడ్ ఉంటాయని సమాచారం. ఈ స్కూటర్‌పై ఎకో మోడ్(20 -25 KMPH)లో ప్రయాణిస్తే 510 కిలో మీటర్లు, స్పీడ్ మోడ్(40-50KMPH)లో ప్రయాణిస్తే 480 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. అయితే, స్కూటర్ స్పీడ్ రేంజ్ బట్టి ధర మారనుంది. రాఫ్ట్ మోటార్స్ ఇండస్ ఎన్ఎక్స్ స్కూటర్‌లో రివర్స్ గేర్, తెఫ్ట్ అలారం, కీలెస్-స్టార్ట్, రిమోట్-లాకింగ్, స్టైలిష్ డిస్క్ బ్రేకులు, చైల్డ్-సేఫ్ పార్కింగ్ మోడ్ వంటి నెక్ట్స్-జెన్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సాధారణ చార్జర్ ద్వారా ఫుల్ చార్జ్ చేయడానికి కనీసం 8 -24 గంటల సమయం పడుతుంది. అదే కంపెనీ అందించే ఫాస్ట్ చార్జర్ ద్వారా 5 గంటలలో ఫుల్ చార్జ్ చేయవచ్చు. ఇందులో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం 11.5 కెడబ్ల్యుహెచ్. ఇందులో ప్రధాన లోపం ఏమిటంటే దీని గరిష్ట స్పీడ్ 50 కి.మీ మాత్రమే.
ఇండస్ ఎన్ఎక్స్ అంచనా ధర:
పరిధి(Range) | Price(ధర) |
480 కి.మీ. | 2,57,431 |
325 కి.మీ. | 1,91,971 |
165 కి.మీ. | 1,18,500 |