దేశంలోనే అతి పెద్ద ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్‌గా వచ్చి ఇటీవల పేటీఎం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పేటీఎం ఐపీఓ ఎంతమంది సామాన్యుల జీవితాలను మార్చడంతో పాటు జీవితంలో ఎన్నడూ చూడనంత సంపదను వారి సొంతం చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆలిఘడ్‌కి చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన విజయ్ శేఖర్ శర్మ 2010లో పేటీఎంని స్టార్టప్‌గా ప్రారంభించారు. పేటీఎం కంపెనీ ప్రారంభంలో నిధులు లేకపోవడంతో తన స్నేహితులు, ఇతర టెక్నోక్రాట్లను భాగస్వాములగా చేసుకుని ఈ స్టార్టప్‌ని వృద్ధి చేశారు.
ఇలా పేటీఎం ప్రారంభ దశలో జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో ఇందులో పని చేసిన అనేక మందికి కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చారు. పేటీఎం ఉన్నత స్థాయికి వచ్చే సరికి సుమారు వెయ్యి మంది అందులో ఉద్యోగులుగా ఉన్నారు. ఇందులో 350 మంది ఆ కంపెనీలో పార్ట్‌నర్లుగానే కొనసాగారు. ఒక్కసారి పేటీఎం బ్రేక్ ఇవెన్‌కి రావడంతో అందులో పని చేస్తున్న ఉద్యోగులకు డిమాండ్ ఏర్పడింది. చాలా మంది మంచి వేతనాలకు ఇతర కంపెనీల్లో జాయిన్ అయ్యారు. అయితే, చాలా మంది పేటీఎంలో తమ వాటాలను అలాగే అట్టిపెట్టుకున్నారు.
(చదవండి: పెట్రోల్, డీజిల్ ద్వారా వచ్చే డబ్బును కేంద్ర, రాష్ట్రాలలో ఎవరు ఎక్కువగా తింటున్నారు?)
తాజాగా స్టాక్‌మార్కెట్లలో పేటీఎం లిస్టయ్యింది. సుమారు రూ. 18,300 కోట్ల నిధులు సమీకరించడం లక్ష్యంగా ఐపీఓ ఇష్యూ చేసింది. రికార్డు స్థాయిలో ఈ కంపెనీ షేరు ధర రూ. 2,150గా పలికింది. దీంతో పేటీఎం ప్రారంభంలో ఉద్యోగులుగా, భాగస్వామ్యులుగా ఉన్న 350 మంది ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయ్యారు. ఇందులో అతి తక్కువ వాటాలు కలిగిన వ్యక్తి ఖాతాలో 1,34,401 డాలర్లు వచ్చి చేరాయి. ఒక్క రోజులోనే కోటీశ్వరుడు అయిపోయారు.