Home Loan Transfer Rules: మనకు ఎంతో ఇష్టమైన ఇంటి కోసం రుణం తీసుకున్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన మనం ఇంటి రుణాన్ని వేరే బ్యాంకుకు బదిలీ చేయాలని అనుకుంటాం. అయితే, ఇలాంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం చాలా డబ్బును ఆదా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వడ్డీ రేట్ల ప్రభావం ఎంత?
ఇంటి రుణం విషయంలో వడ్డీ రేట్లు చాలా కీలకం. ఇది 0.5% తగ్గినా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు 9.5% వడ్డీతో రూ.50 లక్షల రుణాన్ని 20 ఏళ్ల కాలవ్యవధికి తీసుకుంటే… కేవలం వడ్డీయే సుమారు రూ.62 లక్షలు అవుతుంది. ఈ రుణాన్ని 9% వడ్డీ వసూలు చేసే బ్యాంకుకు బదిలీ చేస్తే, వడ్డీ దాదాపు రూ.58 లక్షలు మాత్రమే అవుతుంది. కాబట్టి, మీరు ఎక్కువ మొత్తంలో రుణం తీసుకున్నప్పుడు బదిలీ చేసుకోవడం వల్ల సుమారు రూ.4. లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
బదిలీ ఎలాంటి సమయంలో చేసుకోవాలి?
లోన్ కాలవ్యవధి ప్రారంభంలో రుణ బదిలీ చేయడం వల్ల ఆర్థికంగా లాభం ఉంటుంది. లేదా మధ్యలో చేసినా కొద్దిగా పర్వాలేదు. ఎందుకంటే ప్రారంభ కాలవ్యవధిలో అసలు కన్నా వద్దీయే ఎక్కువ చెల్లిస్తారు. ఆఖరి సంవత్సరాల్లో రుణ బదిలీకి ప్రయత్నించడం సరి కాదు. ఎందుకంటే, అప్పటికే చాలా వరకు వడ్డీని చెల్లించేసి ఉంటారు. కాబట్టి, ఇది రుణగ్రహీతకు లాభం చేకూర్చదు. ఎక్కువ వడ్డీ చెల్లించే ప్రారంభ కాలవ్యవధిలోనే రుణ బదిలీకి ప్రయత్నించడం మేలు.
నిబంధనలు, సేవలు
ప్రస్తుత హోం లోన్‌కు సంబంధించి ప్రీపేమెంట్ ఛార్జీలు ఎక్కువగా ఉండొచ్చు. ఇంకా, ప్రస్తుత బ్యాంకు అందించే సేవలతో అసంతృప్తిగా ఉన్నా కూడా మెరుగైన సేవలను అందించే బ్యాంకుకు మారడానికి హోం లోన్‌ను బదిలీ చేసుకోవడం ఉత్తమం.
ఇంకా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈఎంఐలు చెల్లించేటప్పుడు డిఫాల్డ్/ఆలస్యం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే, రుణ బదిలీకి దరఖాస్తు చేసినా కొత్త బ్యాంకు మీ మునుపటి / బ్యాంకులో రీపేమెంట్ రికార్డులను పరిశీలించే అవకాశం ఉంది. అక్కడ ఈఎంఐ చెల్లింపులు సక్రమంగా లేకపోతే రుణ బదిలీని అమోదించే అవకాశం ఉండదు. అంతేకాకుందా, వేరే బ్యాంకు ప్రకటించిన వడ్డీ రేట్లు, రాయితీలు స్వల్పకాలమా, దీర్ణకాలమా అనేది కూడా తనిఖీ చేయాలి.
ప్రాసెసింగ్ ఛార్జీలు ప్రభావం ఎంత?
మీ ఇంటి రుణాన్ని వేరే బ్యాంకుకు బదిలీ చేసినప్పుడు, దానికి మళ్లీ ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు చెల్లించాలి. ఈ ఫీజులు తక్కువగా ఉంటేనే మీకు రుణ బదిలీ తకంగా కలిసి వస్తుంది. మీ క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాసెసింగ్ ఫీజు మపి చేయమని లేదా తగ్గించమని కూడా కొత్త బ్యాంకును అభ్యర్థించవచ్చు.