ఎస్‌బీఐ తన ఖాతాదారులకు మళ్లీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్) ఛార్జీలను పెంచుతోంది. ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రొత్సహించేందుకుగాను ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. యోనో బ్యాంకింగ్ ద్వారా రూ.5 లక్షల వరకు ఐఎంపీఎస్ సేవలకు ఎలాంటి సర్వీస్ ఛార్జ్, జీఎస్టీ వర్తించదు. బ్యాంకుల్లో చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఐఎంపీఎస్ ఛార్జీని అమలు చేయనున్నట్లు ఖాతాదారులను ఇప్పటికే బ్యాంక్ అలర్ట్ చేసింది.
కొత్త ఛార్జీలు ఇలా ఉండనున్నాయి..!
- రూ. 5 లక్షల వరకు ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే ఏదైనా ఐఎంపీఎస్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. వీటిలో యోనో యాప్ లావాదేవీలకు కూడా వర్తించనుంది.
- ఐఎంపీఎస్ లావాదేవీల్లో భాగంగా రూ.1,000 నుంచి రూ.10,000 వరకు బదిలీ చేస్తే రూ. 2తో పాటు జీఎస్టీ చెల్లించాలి.
- రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు ఐఎంపీఎస్ లావాదేవీపై రూ.4తో పాటుగా జీఎస్టీ చెల్లించాలి.
- రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు జరిపే లావాదేవీలపై రూ.12తో పాటు జీఎస్టీని ఛార్జ్ చేయనుంది.
- తాజాగా ఎస్‌బీఐ రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు కొత్త స్లాబ్‌ను యాడ్ చేసింది. ఈ నగదు లావాదేవీలపై రూ. 20 పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.