కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నవారికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) శుభవార్త చెప్పింది. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి 6.66 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల వరకు గృహ రుణం పొందవచ్చు అని పేర్కొంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) తాజాగా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్)తో ఒప్పందం చేసుకుంది. గృహరుణాలను తమ 4.5 కోట్ల మంది ఖాతాదార్లకు తక్కువ వడ్డీకే అందించేందుకు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌తో జత కట్టినట్లు ఐపీపీబీ సెప్టెంబర్ 7న విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
దేశవ్యాప్తంగా 650 బ్రాంచ్‌లు, 1,36,000 బ్యాంకింగ్ యాక్సిస్ పాయింట్లతో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌కు విస్తృతమైన నెట్‌వర్క్ ఉన్నట్లు పేర్కొంది. ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ ద్వారా గృహ రుణాలను దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సులభంగా అందించడంలో ఈ ఒప్పందం ముఖ్య పాత్ర పోషించున్నట్లు ఐపీపీబీ తన ప్రకటనలో వెల్లడించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద గృహ రుణాలకు సంబంధించి క్రెడిట్ అండర్ రైటింగ్, ప్రాసెసింగ్, పంపిణీ మొదలైన పనులను ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ నిర్వహిస్తుంది.(చదవండి: కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారు ముందు ఇవి తెలుసుకోండి?)
6.66 శాతం ప్రారంభ వడ్డీ
జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వారికి 6.66 శాతం ప్రారంభ వడ్డీతో రూ.50 లక్షల వరకు గృహరుణాలను ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఆఫర్ చేస్తోంది. పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా గానీ, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా గానీ ఈ గృహ రుణాలను పొందవచ్చు. రుణ అర్హత ఆధారంగా బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు.. వినియోగదారునికి గృహ రుణాలను మంజూరు చేస్తాయి. ఇక్కడ రుణ అర్హత అంటే.. మీకు బ్యాంకు ఎంతమేరకు రుణం ఇవ్వగలదో తెలుసుకోవడం. దరఖాస్తుదారుడి ఆర్థిక స్థితి, నెలవారీ ఆదాయం, వృత్తి, పనిచేసే సంస్థ, వయసు, క్రెడిట్ స్కోర్, ఆస్తులు మొదలైన అన్ని వివరాలను పరిశీలిస్తారు.