Personal Loan Guide: మనకు ఆర్థిక అవసరాలు ఎప్పుడు, ఏ రూపంలో వస్తాయో చెప్పలేం. కొన్నిసార్లు అత్యవసర సమయంలో మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది వ్యక్తిగత రుణం (Personal Loan) తీసుకుంటారు. అయితే మొదటిసారి మీరు పర్సనల్ లోన్స్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకునేబోయే విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
వ్యక్తిగత రుణాలను ఎక్కడి నుంచి తీసుకోవాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీలు), లోన్ యాప్‌లు వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. అందుకే ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాలో తెలుసుకునేందుకు కొన్ని విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి.
బ్యాంక్: బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ తీసుకోవడం అనేది చాలా సురక్షితం అని చెప్పుకోవాలి. అయితే ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లతో సరిపోల్చుకుని రుణం తీసుకోవడం మంచిది.
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(NBFC): మీకు బ్యాంకు పర్సనల్ లోన్ ఇవ్వనప్పుడు ఎన్బీఎఫ్సీలను సంప్రదించవచ్చు. అయితే బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు ఎక్కువ వడ్డీ రేట్లను విధిస్తాయి.
లోన్ యాప్స్: బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలలోనే కాకుండా లోన్ యాప్స్ ద్వారా కూడా పర్సనల్ లోన్స్ పొందొచ్చు. అయితే, వీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.
ఆర్బీఐ గుర్తింపు: మీకు లోన్ ఇచ్చే బ్యాంకు, ఎస్బీఎఫ్సీ లేదా యాప్ ఆర్బీఐ గుర్తింపు పొందిందా లేదా అనే విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.
ఈఎంఐ కాలిక్యులేటర్:
చాలా మంది పర్సనల్ లోన్‌ను ఈఎంఐ రూపంలో చెల్లిస్తుంటారు. అయితే లోన్ తీసుకునేందుకు ముందే మీరు నెలవారీ చెల్లించాల్సిన మొత్తం ఎంత అనేది ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. లోన్ మొత్తం, లోన్ వ్యవధి, వడ్డీ రేటు ఆధారంగా మీరు లోన్ కోసం నెలవారీ కట్టాల్సిన మొత్తం ఎంతో తెలిసిపోతుంది.
ఊదాహరణకు మీరు రూ.10 లక్షల విలువైన పర్సనల్ లోన్ పొందారు. వడ్డీ 10 శాతం. లోన్ వ్యవధి 3ఏళ్లు అనుకుంటే అప్పుడు మీరు నెలకు 32,267 రూపాయల ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.
వీటి విషయంలోనూ జాగ్రత్త సుమా! అలాగే పర్సనల్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, రుణం ఇచ్చే సంస్థ వంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వడ్డీ రేటు: మీరు లోన్ తీసుకునేముందు పలు బ్యాంకులు విధించే వడ్డీ రేట్లను ఒకసారి పరిశీలించాలి. ఆ తర్వాత ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేటుకు రుణం అందిస్తుందో అందులోనే వ్యక్తిగత రుణం తీసుకోవడం మంచిది.
ప్రాసెసింగ్ ఫీజు: పర్సనల్ లోన్ తీసుకునేవారే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీకు లోన్ ఇచ్చే ముందు దీన్ని రుణదాతలు తీసుకుంటారు. ప్రాసెసింగ్ రుసుము ఎక్కువగా ఉంటే, మీరే వేరే బ్యాంకులో లోన్ తీసుకోవడం కోసం ఆలోచించవచ్చు.