Dalitha Bandhu Telangana Scheme Details in Telugu, దళిత బంధు పథకం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో సంక్షేమ పథకం పేరే ఈ పథకం. గతంలో దళితులకు మూడెకరాల భూమి అని ప్రభుత్వం చేసిన ప్రకటన సక్రమంగా అమలు కాకపోవడంతో వెల్లువెత్తిన విమర్శలను గమనించిన ప్రభుత్వం హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ దళితబంధు పథకం అనేది దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఒక పథకం. ఈ పథకంలో భాగంగా అర్హులైన దళితుల కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది.
(ఇది కూడా చదవండి: కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)
తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం అని తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పరిశ్రమలను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందడంకోసం ఈ పథకం ఉపయోగపడుతుంది.
దళిత బంధు(Dalita Bandhu) పథకానికి ఎవరు అర్హులు?
- దళిత బంధు పథకాన్ని 2014 నాటి కుటుంబ సమగ్ర సర్వేలోని వివరాల ఆధారంగా ప్రభుత్వ యంత్రాంగం తిరిగి సర్వే చేసి లబ్ధిదారులను గుర్తిస్తుంది.
- గ్రామ స్థాయిలో ఈ సర్వే జరిపాక లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత గ్రామ సభ దీనిని ఆమోదిస్తుంది.
- ఒకవేళ సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారు, కొత్త వారు ఎవరైనా ఉంటే వారికీ పథకాన్ని వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు.
- అందువల్ల లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కనివారు(apply for dalitha bandhu scheme) పంచాయతీ కార్యదర్శిని, గ్రామ సర్పంచిని, వార్డు సభ్యులను సంప్రదించాలి.
దళిత బంధు(Dalita Bandhu) సాయంతో ఏ వ్యాపారం చేయాలి?
- దళిత బంధు ద్వారా ఇచ్చే రూ.10 లక్షలతో వ్యాపారం చేసేందుకు దాదాపు 30కి పైగా వ్యాపారాలను అధికారులు గుర్తించారు.
- ఆయా యూనిట్లు ఏర్పాటుకు మాత్రమే ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది.
- డెయిరీ ఫామ్, టాక్సీ వాహనాల కొనుగోలు, సూపర్ మార్కెట్ ఏర్పాటు, ప్రొక్లెయిన్లు, లారీలు వంటి భారీ వాహనాల కొనుగోలుకు వీటిని వాడుకోవచ్చు.
- వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన వాహనాలు, సిమెంట్ ఇటుకలు తయారీ యూనిట్, రెడీ మిక్స్ తదితర యూనిట్లు ఏర్పాటు చేయవచ్చు.
- లబ్ధిదారులు బృందంగా ఏర్పడి కూడా వ్యాపారం చేసుకోవచ్చు. 10 మంది వరకు గ్రూప్‌గా ఏర్పడవచ్చు. ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్, మెడికల్ డివైజెస్ తయారీ వంటి వ్యాపారాలు కూడా చేయవచ్చు.
దళిత బంధు(Dalitha Bandhu) లబ్ధిదారులకు మార్కెటింగ్‌కూ సాయం..
- దళిత బంధు ద్వారా చేసే వ్యాపారాలకు ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తుంది.
- ఈ పథకం కింద కొనుగోలు చేసే టాక్సీ వాహనాలను ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం ఉంటే లీజుకు తీసుకుంటారు.
- అలాగే ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఆయా భారీ వాహనాల అవసరం ఉంటే వాటిని వినియోగించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారు.
- దళిత బంధు ద్వారా చేసే వ్యాపారాలపై ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ ఉంటుంది. అలాగే వీటికి సాయంగా ప్రభుత్వ యాప్ కూడా రూపుదిద్దుకుంది.
- దీని ద్వారా ప్రతి లబ్ధిదారుడికి ఆయా వ్యాపారాల్లో తగిన సూచనలు జారీచేస్తారు.
- లబ్ధిదారుడు చనిపోతే దళిత రక్షణ నిధి ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తారు. ఆయా యూనిట్లు కొనసాగేలా ప్రభుత్వం తగిన చేయూత ఇస్తుంది.
దళిత బంధు పథకానికి అవసరమైన పత్రాలు?
- కుల ధృవీకరణ పత్రం
- బ్యాంక్ ఖాతా వివరాలు
- చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్
- ఆధార్ కార్డు
- ఓటరు గుర్తింపు కార్డు
- నివాస రుజువు