Friday, November 22, 2024
HomeGovernmentమీకు భూమి ఉందా? అయితే.. అడంగళ్‌/పహాణీ, బంచరాయి భూమి అంటే ఏమిటి?

మీకు భూమి ఉందా? అయితే.. అడంగళ్‌/పహాణీ, బంచరాయి భూమి అంటే ఏమిటి?

భూముల గురుంచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిజ్ఞానం కలిగి ఉంటే మంచిది. అసలు పహణీ/ఆడంగళ్ అంటే ఇప్పుడు ఉన్న చాలా మందికి తెలియదు. అందుకే భూమికి సంబంధించిన ప్రతి పదం అర్ధం తెలుసుకోవడం మంచిది. ఎలాంటి భూమిని ఏమంటారనేది కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఆసక్తితో కొందరు, వృత్తి రీత్యా మరికొందరు వీటి వివరాలను తెలుసుకుంటారు. వ్యవహారికంగా, ప్రభుత్వ పరంగా రెవెన్యూ యంత్రాంగం వ్యవసాయ, నివాస యోగ్యమైన భూములను ప్రత్యేక విభాగాలుగా విభజించి వాటికి పేర్లు ఖరారు చేసింది.

ఈ పేర్లను ఇప్పుడు పెట్టలేదు, మన తాతల కాలం నుంచి వస్తుంది. కొన్ని పదాలను కొత్తగా ఈ మధ్య చేర్చి ఉండే అవకాశం ఉంది. భూ సంబంధిత ఆంశాలపై సమాచారం, రెవెన్యూ యంత్రాంగ విధివిధానాలు, చట్టాలు-నిబంధనల క్రమాలపై అవగాహన రైతులకు, భూమి ఉన్న ప్రతి పౌరుడు తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

కొన్ని రకాల పదాలు అంటే ఏమిటి, వాటి అర్ధాలను మీకోసం అందిస్తున్నాము. రెవెన్యూలో కీలకమైనది భూములు. అయితే భూములపై ప్రజలకు అవగాహనలేకపోవడంతో ప్రభుత్వ భూములను కొని మోసపోతున్నారు.

అందుకే ప్రజలకు భూములపై అవగాహన తప్పనిసరి. పహణీలలో తమ పేరు ఉందోలేదో కచ్చితంగా తెలుసుకోవాలి. రెవెన్యూ వ్యవస్థ ఆన్‌లైన్‌ కావడంతో ప్రజలు ఏవిషయమైనా తెలుసుకునే అవకాశం ఉంది అయితే ప్రజలు దీనిని పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ భూములు సర్కారీ, బంచరాయి, పోరంబోకు అసైన్డు తదితర భూములుంటాయి. అయితే ఈ భూములపై ప్రజలకు అవగాహనలేదు. ఇవి ప్రభుత్వ ఆస్తి. కొంతమంది మోసం చేసి ఈభూములు అమ్ముతుంటారు. కనుక ప్రజలు భూములపై అవగాహన పెంచుకోవాలి.

- Advertisement -

అడంగళ్‌/పహాణీ: అంటే గ్రామంలో సాగు చేసే భూముల వివరాలను నమోదు చేసే ఒక రిజిస్టరు. దీనిని ఆంధ్ర ప్రాంతంలో అడంగళ్‌ అని, తెలంగాణ ప్రాంతంలో పహాణీ అని పిలుస్తారు. ఈ రిజిస్టరును గ్రామ లెక్క నెంబరు 3 అని కూడా అంటారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ- పహాణీలు జారీ చేస్తున్నారు. ఈ` రిజిస్టరులో గ్రామంలోని అన్ని భూముల వివరాలను ప్రతి సంవత్సరం నమోదు చేస్తారు.

బంచరాయి భూమి: గ్రామంలో ఉన్న పశువుల మేత కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి. గతంలో గ్రామీణ ప్రాంతాలలో రైతులు, పశువుల పెంపకంపై ఆధారపడి జీవించేవారు ఎక్కువగా ఉండేవారు కాబట్టి, వారి పశువులకు నిత్యం మేత అవసరం అందుకని నివాసాలకు దూరంగా పచ్చిక ఉన్న ప్రాంతాన్ని పశువులు మేత మేయడానికి ప్రత్యేకంగా ప్రతీ గ్రామంలో గుర్తిస్తారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి, దీనిపై ఎవరికీ అధికారాలు ఉండవు.

హోమ్‌స్టెడ్‌: అంటే గ్రామంలో, పట్టణంలో భూమి లేని రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిపనుల వారు ప్రభుత్వ, ఇతరులకు సంబంధించిన భూములపై తేదీ 14.8.1975 నాటికి నివాసం ఏర్పర్చుకున్న స్థలాన్ని హోమ్‌స్టెడ్‌ అంటారు. అలాంటి భూముల్లో నివాసం ఉన్నవారికి తాత్కాలికంగా స్థానిక అధికారులు అనుమతులు ఇస్తారు. ప్రస్తుతం అధికారులు ఎవరు అనుమతులు ఇవ్వడం లేదు.

ఆయకట్టు: ప్రాజెక్టు, చెరువులు, కాలువల కింద సాగు చేస్తున్న భూములను ఆయకట్టు అంటారు. ఆయకట్టు భూమిలో కేవలం వ్యవసాయం మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ భూమిలో ఇతర కట్టడాలు, అభవృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం అంగీకరించదు.

ఎకరం: భూమి విస్తీర్ణానికి కొలమానము.. ఒక ఎకరం, ఇది 4,840 చదరపు గజములకు సమానము. 100 సెంట్లు లేదా 40 గుంటల భూమిని ఎకరం అంటారు. గుంట అంటే 121 చదరపు గజములు. 40 గుంటలు కలిస్తే ఒక ఎకరం.

- Advertisement -

అడ్‌వర్స్‌ పొసెషన్‌: వాస్తవంగా భూమిపై హక్కు ఉన్న వ్యక్తి అనుమతి పొందకుండా ఆ భూమిని వాస్తవంగా, శాంతియుతంగా, నిరవధికంగా, బహిరంగంగా స్వాధీనంలో ఉంచుకొని దానిపై నియంత్రణాధికారాన్ని పొందడాన్ని అడ్‌వర్స్‌ పొసెషన్‌ అంటారు. పట్టా భూమి 12 సంవత్సరాలు, ప్రభుత్వ భూమి 30 సంవత్సరాలు ఒకరి స్వాధీనంలో ఉన్నట్లయితే వారు సివిల్‌ కోర్టు ద్వారా యాజమాన్య హక్కులు పొందవచ్చు.

అగ్రహారం: బ్రాహ్మణులకు శిస్తు లేకుండా, తక్కువ శిస్తుతో గ్రాంటుగా ఇచ్చిన గ్రామం లేదా గ్రామంలోని కొంత భాగం. గతంలో రాజులకు సేవ చేసినందుకు గాను ఈ భూమిని బ్రాహ్మణులకు ఉచితంగా ఇచ్చేవారు.

అజమాయిషీ: భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలను తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అని అంటారు. మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, గ్రామ రెవెన్యూ అధికారి రాసిన లెక్కల్లోని వివరాలను గ్రామంలో తనిఖీ చేసిన భూముల్లో కొన్నింటిని తహసీల్దార్‌ లేదా డిప్యూటీ తహసీల్దార్‌ తనిఖీ చేయాలి. అలా తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్క నం.3లో పేర్కొంటారు. ఆ అజమాయిషీని ప్రతి సంవత్సరం నిర్వహించాలి.

ఆబాదీ/గ్రామకంఠం: గ్రామంలో ప్రజలు నివసించడానికి ఉద్దేశించిన భూమి. గ్రామ ఉమ్మడి స్థలం. ప్రభుత్వ సభలు, సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తారు.

ఆబ్సెంటీ ల్యాండులార్డు: పరోక్ష భూస్వామి.. ఒక గ్రామంలో భూమి ఉండి వేరొక చోట నివాసముంటూ భూమిని సొంతంగా సాగుచేయని భూ యజమాని. భూమిపై హక్కులన్నీ అతడికే చెందుతాయి.

- Advertisement -

అసామిషిక్మీ: భూ యజమానికి పన్ను చెల్లించే నిబంధనపై భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న వ్యక్తి.

అసైన్డ్‌ భూమి: భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికిగాని, ఇళ్లు నిర్మించుకోవడానికి గాని ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని అసైన్డ్‌ భూమి అంటారు. ఈ భూమిని వారసత్వంగా మాత్రమే అనుభవించాలి. ఇతరులకు అమ్మరాదు, ఏ విధమైన బదిలీ చేయరాదు.

ఏడబ్య్లూడీ భూములు: శిస్తును నిర్దారించిన ప్రభుత్వ భూములు, లేదా అసైన్డ్‌ వెస్ట్‌ ల్యాండ్‌ అంటారు. ఏడబ్య్లూడీ భూములు మెట్ట భూములయితే డైల్యాండ్‌ భూములని అంటారు. వీటిని భూమి లేని నిరుపేదలకు అసైన్‌ చేయవచ్చు.

బి-మెమో: ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించమని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు.

బందోబస్తు: వ్యవసాయ భూముల సర్వే, వర్గీకరణను బందోబస్తు భూమి అంటారు.

బంజరు: ఖాళీగా, వ్యర్థంగా ఉన్న ప్రభుత్వ భూములను బంజరు భూములు అంటారు.

భూమి లేని నిరుపేద: రెండున్నర ఎకరాల మాగాణి(తరీ) లేదా ఐదు ఎకరాల మెట్ట(ఖుష్కి) భూమికంటే తక్కువ భూమి ఉండి, సంవత్సరాదాయం రూ.11 వేల కంటే తక్కువగా ఉన్నవారు భూమి లేని నిరుపేదలు. వీరు మాత్రమే ప్రభుత్వ భూమిని పొందడానికి అర్హులు.

భీఘా: భీఘా అంటే 30 గుంటల భూమి. ఈ భూమి 36.30 చదరపు గజాలతో సమానం.

బిల్‌మక్తా: సాధారణ శిస్తుకంటే తక్కువ శిస్తు నిర్ణయించిన భూమి, గ్రామాన్ని బిల్‌మక్తా అంటారు.

బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్లు: రెవెన్యూ పరిపాలనలో విధివిధానాలను సూచిస్తూ అప్పటి బోర్డు ఆఫ్‌ రెవెన్యూ జారీ చేసిన ఉత్తర్వులు. ఇవి ఇప్పటికీ ఉన్నాయి.

చెల్కా: మట్టిలో ఎక్కువ భాగం ఇసుకతో కూడుకున్న భూమిని చేల్కా భూమి అంటారు. సాధారణంగా ఈ భూముల్లో నీరు తక్కువగా అవసరం ఉండే పంటలు పండిస్తారు.

చలానా: ఇర్సాలునామా అనగా గ్రామ లెక్క నం.7. దీనినే చలానా అంటారు. దీని ద్వారానే ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూ మి శిస్తు, వగైరాలను వసూలు చేసి నిర్ణీత తేదీల్లో ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు.

చిట్టా: చిట్టా అనగా రోజువారి వసూళ్లు తెలియజేసే ఒక రిజిస్టర్‌. దీనినే గ్రామ లెక్క నం.6 అంటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటిపన్ను, భూమి శిస్తు వగైరాలు అసామి వారీగా వసూలు చేసి ఈ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.

చౌపస్లా: పట్టాదారుకు ఉన్న భూముల వివరాలను తెలియజేసే ఒక రిజిస్టర్‌. ఇందులో భూ వర్గీకరణ, విస్తీర్ణం, పట్టాదారు పేరు తదితర వివరాలు ఉంటాయి.

దస్తావేజు: భూమికి సంబంధించిన కొనుగోలు, అమ్మకాలు, ఇతర లావాదేవీలను తెలియజేయు ఒక పత్రం. భూ బదలాయింపు జరిగినపుడు ఈ దస్తావేజును చట్టపరంగా తప్పక రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి.

డైగ్లాట్‌: రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సర్వే సెటిల్‌మెంట్‌ కార్యకలాపాలు పూర్తిచేసి ప్రతి గ్రామంలో భూముల వివరాలను నమోదు చేస్తారు. ఇందులో అన్నిరకాల భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణం, అవి సర్కారా, ఇనాం భూములా, మాగాణియా, మెట్ట భూములా, వాటి వర్గీకరణ, శిస్తు మొదలగు వివరాలుంటాయి. ఈ రిజిష్టర్‌ను ఆంగ్లంలో, తెలుగులో రాస్తారు. అందుకే ‘డైగ్లాట్‌’ అంటారు. దీనినే శాశ్వత ఏ రిజిస్టర్‌గా పరిగణిస్తారు. ఈ రిజిస్టరు మిగిలిన గ్రామ రెవెన్యూ రికార్డులన్నిటికీ మూలస్తంభంలాంటిది.

ఎన్‌డార్స్‌మెంట్‌: గ్రామంలోని ప్రజలు, ప్రభుత్వ అధికారులకు ఏదైనా దరఖాస్తు చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తెలియజేయు విధానం.

ఇజారా: ప్రభుత్వానికి చెందిన బంజరు భూములను వ్యవసాయానికి గానీ, నివాసం ఉండడానికి గానీ కొంత నిర్ధిష్టమైన పన్ను చెల్లించే పద్ధతిపై లీజుకిచ్చుటను ‘ఇజారా’ అంటారు.

ఫసలీ: ఫసలీ అంటే ప్రతి సంవత్సరం జులై, 1 నుంచి తర్వాత సంవత్సరం జూన్‌, 30వ తేదీ వరకు ఉన్న 12 నెలల కాలం. దీనిని పంట కాలాన్ని బట్టి రూపొందించారు. ఈ పదం మొగలు చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉంది.

ఎఫ్‌ఎంబీ టిప్పన్‌: గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఇది ఒకటి. గ్రామంలో ఉన్న అన్ని సర్వే నంబర్ల పటములు ఉంటాయి. వాటి నిర్ధిష్ట కొలతలు కూడా ఉంటాయి.

గట్‌ నంబర్‌: సాగు భూమిని నిరుపయోగంగా వదిలి వేయడం. దీనిని బీడు భూమి అని కూడా అంటారు.

జమాబందీ: జమాబందీ అంటే ప్రభుత్వానికి రావలసిన భూమి పన్ను, నీటి పన్ను, ఇతర బకాయిలు. సక్రమంగా లెక్క కట్టుట, రెవెన్యూ లెక్కల్లోకి తీసుకురాబడినవా లేదా అని నిర్ధారించుటకు గ్రామ, మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీనే జమాబందీ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా గ్రామంలో ప్రభుత్వానికి రావలసిన మొత్తం డిమాండ్‌ నిర్ధారింపబడుతుంది. అంతేగాక.. ఇది మండలస్థాయి అధికారులందరూ వారు నిర్వర్తించాల్సిన విధులు, సక్రమంగా నిర్వహిస్తున్నారోలేదో పరిశీలించేందుకు ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా రైతులు తమ సాదకబాధలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. జమాబందీని ఏడాదికి ఒకసారి జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర డిప్యూటీ కలెక్టర్లు నిర్వహిస్తారు.

ఏజెన్సీ:
గిరిజనులు నివసించే ప్రాంతాలను షెడ్యూల్డు ప్రాంతాలుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం షెడ్యూ ల్డు ప్రాంతాలుగా పిలువబడే ఈ ప్రాంతాలను ఏజెన్సీ అంటారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన యంత్రాంగం ఉంటుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles