PM KISAN e-KYC: రైతుల ఆర్ధిక స్థితిని మెరుగు పరించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్ యోజన) పథకాన్ని కేంద్రం తీసుకొని వచ్చింది. కోట్లాది రైతులు తమ పంట పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రైతులకు అందిస్తోంది.
పీఎం కిసాన్ యోజన 17వ విడుత నిధులకు సంబంధించిన ఫైల్ మీద మూడవ సారి ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ సంతకం చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతుల పెట్టుబడికి ఇది బాగా దోహదపడుతుంది. అయితే మీకు గతంలో ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నా ఈ-కేవైసీ చేయకపోతే మీకు ఈ సారి నగదు జమ అవ్వదు. అయితే, ఈ ఈ-కేవైసీ మీరు చేశారో లేదో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ-కేవైసీ ప్రాముఖ్యత..
ఈ పథకానికి అర్హులైన రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీని చేపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే తర్వాత రాబోయే విడతలో PMKISANకి సంబంధించిన నిధులు మీ ఖాతాలో జమ కావు. అందుకే వీలైనంత త్వరగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయించుకోవడం మంచిది. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తయితే ఓకే కానీ.. లేకపోతే మాత్రం వెంటేనే చేయించుకోవడం మంచిది.
ఈ-కేవైసీ ఎలా చేసుకోవాలి?
- మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
- ఈ-కేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- అక్కడ మీ 12 అంకెలున్న ఆధార్ నంబర్ ను నమోదు చేయాలి.
- ఆ తర్వాత సెర్చ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అంతే మీ ఈ-కేవైసీ విజయవంతంగా పూర్తవుతుంది.
- ఒకవేళ మీరు ఇచ్చిన సమాచారం కాకుండా అందులో ఏమైనా తప్పులుంటే వాటిని వెంటనే సరిచేసుకోవాలి. లేకుంటే మీ ఖాతాలో నగదు జమ ఆగిపోతుంది.
- అందుకే అలాంటి సమస్యలు రాకుండా సమస్యలను pmkisan-ict@gov.in కి ఈ-మెయిల్ చేయొచ్చు. లేదా పీఎం కిసాన్ యోజన నంబర్స్ 155261, 1800115526(టోల్ ఫ్రీ), లేదా 011-23381092కు కాల్ చేయొచ్చు.
పీఎం కిసాన్ యోజన పథకం ముఖ్య ఉద్దేశ్యం:
కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అందిస్తోంది. అందులో ఒకటి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దీని ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను అందిస్తోంది. ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు ప్రతి ఏడాది రూ. 6000 అందిస్తుంది. అయితే దీనిని ఒకేసారి కాకుండా మూడు సమాన విడతలలో అందిస్తుంది. అంటే ప్రతి విడతలో రూ. 2000 చొప్పున రైతులకు అందిస్తుంది.