కొత్తగా ఉద్యోగంలో చేరినవాళ్లు, కార్పొరేట్ ప్రపంచంలోకి కొత్తగా అడుగు పెట్టిన చాలా మందికి వారి శాలరీ స్లిప్‌లో ఉన్న HRA, DA , PF వంటి వాటి గురుంచి అసలు ఏమి అర్ధం కాదు. అందుకే, ప్రతి ఉద్యోగి శాలరీ స్లిప్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఉద్యోగికి శాలరీ స్లిప్ అంటే ఏమిటో అర్థం కానట్లయితే పని కోసం, ఇతర అవసరాల కోసం అప్లై చేసేటప్పుడు పేపర్ వర్క్ నింపడంలో వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మీరు ఏ స్థానంలో ఉన్నా కూడా శాలరీ స్లిప్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలీ.
అసలు శాలరీ స్లిప్‌లో బేసిక్ శాలరీ, హెచ్ఆర్ఏ, కరువు భత్యం, స్పెషల్ అలవెన్సు వంటి వివిధ రకాల అంశాలుంటాయి. ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతీ నెలా ఇచ్చే శాలరీ స్లిప్‌లో వేతనం, భత్యాలు, మినహాయింపులు, కోతలు వంటి వివరాలు ఉంటాయి. అందులో ఉండే అన్ని అంశాల గురించి ఎక్కువ శాతం మందికి సరైన అవగాహన ఉండదు. ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా శాలరీ స్లిప్ ఎవరికైనా చాలా ముఖ్యమైనది.
మీరు ఉద్యోగం చేయడం ద్వారా వచ్చే ఆదాయానికి శాలరీ స్లిప్ చట్టపరమైన రుజువు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం, బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం వరకు ఇది చాలా ముఖ్యమైనది. ప్రతీ నెలా నిర్ణీత తేదీన ఉద్యోగి బ్యాంకు ఖాతాలో జీతాన్ని జమ చేసిన తర్వాత కంపెనీ ఫైనాన్స్ విభాగం ఉద్యోగులకు పే స్లిప్ జారీ చేస్తుంది. దీనిలో ఉండే ప్రధాన అంశాల గురుంచి మన ఒక్కసారి తెలుసుకుందాం.
ప్రాథమిక జీతం(Basic Salary)
- శాలరీ స్లిప్‌లో ప్రాథమిక జీతం మొదట పేర్కొంటారు. దీని ఆధారంగా, హెచ్ఆర్ఏతో సహా ఇతర రకాల భత్యం నిర్ణయించబడుతుంది. దీని ఆధారంగా పీఎఫ్ కూడా నిర్ణయించబడుతుంది. ఎటువంటి మినహాయింపులు తీసేయకుండా ఉద్యోగికి లభించే మొత్తం వేతనమే గ్రాస్ పే అంటారు. ఇందులో బేసిక్ శాలరీ(మూలవేతనం) అనేది గ్రాస్ శాలరీలో 50 శాతం వరకు ఉంటుంది. అన్ని రకాల భత్యాలు ఈ మూల వేతనాన్ని బట్టే నిర్ణయిస్తారు. మూలవేతనం 100 శాతం ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది.
ఇంటి అద్దె భత్యం(House Rent Allowance)
- హెచ్ఆర్ఏ అంటే ఉద్యోగుల జీవన వ్యయాలు. ఇది ప్రాథమిక వేతనంలో 50 శాతం వరకు ఉంటుంది. మీ ప్రాథమిక జీతంలో 10 శాతం మినహాయించిన తర్వాత మీరు అద్దె కోసం సంవత్సరంలో మీరు చెల్లించే అద్దె మొత్తం కూడా హెచ్ఆర్ఏ కావచ్చు. ఈ రెండింటిలో తక్కువ వాటాను కంపెనీ జమ చేస్తుంది. మీరు చెల్లించే ఇంటి అద్దెకు మీరు ఆదాయపు పన్ను చట్టం కింద పూర్తి లేదా పాక్షిక పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. పేస్లిప్ లో ఉన్న హెచ్ఆర్ఏ మొత్తం వీటిలో ఏది తక్కువ అయితే దానిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏదైనా వార్షికంగానే లెక్కిస్తారు.
కరువు భత్యం(Dearness Allowance)
- కరువు భత్యం అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా నిజ వేతనాలు పడిపోకుండా ఇచ్చే పరిహారం. ఉదాహరణకు ఈ రోజు కిలో బియ్యం 40 రూపాయలు ఉంది అనుకుంటే ఒక ఏడాది తర్వాత అదే బియ్యం ధర రూ.44 పెరిగితే అప్పుడు ధర పది శాతం పెరిగినట్టు కదా. అంటే, కిలో బియ్యం కొనుక్కోవడానికి ఇప్పటి కంటే ఏడాది తర్వాత 10 శాతం ఎక్కువ ఖర్చుపెట్టాలి. దీనర్థం జీతం పెరగకపోతే, కార్మికుడి నిజవేతనం 10 శాతం తగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు 100 రూపాయలు ఉన్న జీతం కాస్తా, 90 రూపాయలకి నిజ వేతనం పడిపోతుందని అర్ధం.
దీనిని భర్తీ చేయకపోతే, కార్మికుని వేతనాలు తగ్గిపోవడమే అవుతుంది. ఉద్యోగులకు చెల్లించే జీతంలో డియర్నెస్ అలోవెన్స్ మరొక భాగం. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి దీనిని చెల్లిస్తారు. మీరు ఎక్కడ నివసిస్తున్నారనే దానిని బట్టి డిఎను నియంత్రించే చట్టాలు విభిన్నంగా ఉంటాయి. ఈ డిఎ అలోవేన్స్‌కు పన్ను నుండి మినహాయింపు ఉండదు.
మెడికల్ అలవెన్స్(Medical Allowance)
- ఈ భత్యం మీకు వైద్య ఖర్చుల నిమిత్తం ఇస్తారు. అవసరమైనప్పుడు ఉద్యోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, రూ. 21,000 వరకు కొంత మొత్తంలో ఈసీఐసీ కోసం చెల్లిస్తారు., అది ఉద్యోగి ఆరోగ్య అవసరాల కోసం తీసివేయబడుతుంది. ఇంతకు ముందు ఈ తగ్గింపు రూ.15,000 వరకు ఉండేది.
ప్రత్యేక భత్యం(Special Allowance)
- ఇది మంచిగా పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహించడానికి ఇవ్వబడే ఒక రకమైన రివార్డ్ అని పిలవబడుతుంది. ప్రతి కంపెనీ పనితీరు విధానం భిన్నంగా ఉంటుంది. ఇది పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది.
ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund)
- ఏదైనా కంపెనీలో 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తే ఆ కంపెనీ ఈపీఎఫ్ చట్టం -1952 ప్రకారం పదవీ విరమణ ప్రయోజనాన్ని అనుసరించాల్సి ఉంటుంది. పీఎఫ్ అనేది మీ ప్రాథమిక జీతంలో 12 శాతం మీ పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. పీఎఫ్ లో మీ జీతం నుంచి తీసివేసిన మొత్తం, అదే మొత్తాన్ని కంపెనీ దాని తరపున మీ పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ఉద్యోగం వదిలేసినప్పుడు లేదా అకస్మాత్తుగా అవసరమైతే వడ్డీతో పాటు మీరు పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. పదవి విరమణ తర్వాత నెల నెల పెన్షన్ కూడా లభిస్తుంది.