111 GO: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తాగునీటిని అందించడం కోసం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం గతంలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన 111 జీవోను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రిజర్వాయర్ల ద్వారా నగరానికి సరఫరా అయ్యే తాగునీరు అతి తక్కువ అని, ఇకపై వాటిపై ఆధార పడాల్సిన అవసరం లేదని రాష్ట్రం పేర్కొంది.
అయినా జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం జీవో నంబర్ 69 జారీ చేశారు. ఈ జలాశయాల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
అప్పట్లో పరిరక్షణ కోసం..
హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదల నుంచి రక్షించేందుకు, అదే సమయంలో తాగునీటిని అందించేలా నిజాం హయంలోనే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. అప్పటి నుంచీ హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులుగా ఉన్న ఈ రిజర్వాయర్ల పరిరక్షణ కోసం 1996లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను జారీ చేసింది.
జలాశయాలకు చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో ఉన్న 1,32,000 ఎకరాల విస్తీర్ణంలో.. పరిశ్రమలు, హో టళ్లు, వాణిజ్య సముదాయాలు, నివాసాలు, నిర్మా ణాల చేపట్టకుండా ఉండటానికి నియంత్రణలు విధించింది. కొన్నేళ్లుగా నగరం శర వేగంగా విస్తరించడం, తాగునీటి కోసం కృష్ణా, గోదావరి జలాలను తరలించడం నేపథ్యంలో.. 111 జీవోను ఎత్తివేయాలన్న డిమాండ్ మొదలైంది. ఈ జీవోను సమీక్షిస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా పలుమార్లు ప్రకటించింది. తాజాగా జీవో ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
1.32 లక్షల ఎకరాలు విక్రయాలకు రెడీ…
గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లుకాగా.. 111 జీవో పరిధిలో ఉన్న భూ విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు కావడం గమనార్హం. జీవో 111 కింద 84 గ్రామాల్లో 1,32,600 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 32 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ప్రభుత్వ భూముల విక్రయాల ద్వారా ఆదాయం కూడా లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆంక్షల ఎత్తివేతతో ఈ భూములన్నీ కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి.
(ఇది కూడా చదవండి: ఇక గ్రామాల్లో ఇల్లు కట్టాలంటే టీఎస్ బిపాస్ అనుమతి తప్పనిసరి!)
భారీగా కంపెనీలు, నిర్మాణాలు..
జీవో ఎత్తివేత ద్వారా నిర్మాణాలపై ఆంక్షలు తొలగిపోవడంతో ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఐటీ హబ్‌గా అవతరించిన గచ్చిబౌలికి ఈ ప్రాంతాలు చేరువలో ఉండటంతో ఐటీ కంపెనీల స్థాపనకు అవకాశం ఏర్పడనుంది. ఈ ప్రాంతాలకు బహుళ అంతస్తుల నిర్మాణాలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వస్తాయని.. భూముల ధరలు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
111 జీవో ఎఫెక్ట్.. ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఢమాల్
ఇప్పుడు ఒకేసారిగా 1,32,600 ఎకరాల భూమి అందుబాటులోకి రావడంతో ఇతర ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే, రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉంది. భూమి మీద పెట్టుబడి పెట్టాలని అనుకునే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టె అవకాశం ఉంది. దీంతో, ఇతర ప్రాంతాల్లో డిమాండ్ తగ్గే అవకాశం ఉంది.
తప్పని కోర్టు చిక్కులు
జంట జలాశయాల ఎగువన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, రిసార్ట్స్, పబ్స్, బార్లు, బహుళ అంతస్తుల భవంతులు, హోటళ్లు, పరిశ్రమలు ఏర్పాటైతే ఈ రెండూ జలాశయాలు కచ్చితంగా కాలుష్యకాసారంగా మారుతాయి. మరో మూసీలా మారే ప్రమాదం పొంచి ఉంది. జీవో 111 తొలగింపులో అనేక న్యాయపరమైన చిక్కులు కూడా ఉన్నాయి అని న్యాయ నిపుణులు అంటున్నారు.