మీకు వ్యక్తిగత కారు ఉందా? మూడున్నర ఎకరాల కంటే ఎక్కువ భూమికి రైతుబంధు వస్తోందా? మీరు ఐటీ రిటర్న్స్​ ఫైల్​ చేస్తున్నారా? మీకు ఏడాదికి రూ.2,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారా? ఇందులో ఏ ఒక్కదానికి మీ సమాదనం ‘అవును​​’ అయినా మీకు కొత్త రేషన్​ కార్డు రాదు. అంతే కాదు, రాబోయే కాలంలో ప్రభుత్వం చేపట్టబోయే రేషన్ ​కార్డుల ఏరివేతలో ఇప్పటికే ఉన్న పాత రేషన్​ కార్డు పోయే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త గైడ్​లైన్స్​ ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్లకు మాత్రమే రేషన్ ​కార్డులు ఇవ్వాలని కలెక్టర్లకు కఠినమైన ఆదేశాలు​ వచ్చాయి.

ఇందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక సాఫ్ట్​వేర్​ ద్వారా ‘360 డిగ్రీస్ అనాలిసిస్’ చేస్తోంది. కొత్తగా వచ్చిన దరఖాస్తులలోని ఆధార్ ​నంబర్​ను ఆ సాఫ్ట్​వేర్​లో నమోదు​ చేయగానే పైన ఆప్షన్ల​కు సరిపోయే అప్లికేషన్లకు ‘రిజక్టెడ్​’ అని వస్తోంది. ఆ తర్వాత మిగిలిన అప్లికేషన్లను తీసుకొని వీఆర్వోలు, ఆర్ఐలు ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్​ చేస్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చిన లిస్టులోంచి పేరు తీసేస్తున్నారు.

కొత్త రేషన్ కార్డుల కోసం 4.4 లక్షల దరఖాస్తులు

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మూడేండ్ల కింద టీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి వరకు రేషన్ కార్డు లేనివాళ్లు, కొత్తగా పెండ్లయినవాళ్లు, ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడ్డవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో గతంలో సుమారు 4.4 లక్షల మంది రేషన్​కార్డు కోసం అప్లై చేసుకున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ కొత్త రేషన్​కార్డుల జారీని పక్కకు పెట్టిన ప్రభుత్వం, త్వరలో జరగబోయే హుజూరాబాద్​ ఎన్నికల నేపథ్యంలో వాటిని బూజు దులిపింది. కొత్తగా మరో 5 లక్షల మంది అప్లై చేసుకుంటారని భావించిన ప్రభుత్వం ఆన్​లైన్​లో ఆప్షన్​ తీసేసింది.

ప్రస్తుతానికి పాత దరఖాస్తుదారులలోనే అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్​వేర్ ​ఉపయోగిస్తున్నారు. ఆధార్ ​కార్డు, పాన్​కార్డు, రైతుబంధు, ఆర్టీఏ సమాచారాన్ని 360 డిగ్రీ అనాలిసిస్​ విధానంలో విశ్లేషణ​ చేస్తున్నారు. గైడ్​లైన్స్​కు విరుద్ధంగా ఉన్న అప్లికేషన్లన్నీ ఆటోమేటిక్​గా రద్దు అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాసెస్​ జరిగిన జిల్లాల్లో సుమారు 20 నుంచి 30 శాతం అప్లికేషన్లు ఇలా పక్కనపెట్టడం గమనార్హం. జనగామ జిల్లాలో189, మంచిర్యాల 493, పెద్దపల్లి 86, కరీంనగర్ 1,800, భద్రాద్రి కొత్తగూడెం 800, మెదక్ లో 506, ఆసిఫాబాద్ లో 1,205, సిరిసిల్లలో 120 దరఖాస్తులను ఇప్పటివరకు రిజక్ట్ చేసి పక్కకు పెట్టినట్లు ఆఫీసర్లు ప్రకటించారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.