తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో అనేక లోపాలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల మంచి కోసం తీసుకొస్తే పోర్టల్ వల్ల అనేక కొత్త సమస్యలు రైతులకు ఎదురుఅవుతున్నాయి. అసలు ఈ పోర్టల్ వల్ల ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరిందా? అంటే అది కూడా లేదు.
ప్రతి చిన్న పనికోసం గతంలో కంటే కాళ్ళు అరిగెల తిరగాల్సి వస్తుంది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయా ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టిసారించింది. అందులో భాగంగానే ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ధరణి పోర్టల్‌పై రైతులు, ప్రజలు తగిన వివరాలతో తమ ఫిర్యాదులను 9133089444 నంబర్‌కు వాట్సాప్ లేదా ascmro@telangana.gov.inకు మెయిల్, 1800 599 4788కి కాల్ చేయాలని సూచించారు. రెవిన్యూ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ధరణి పోర్టల్‌లో పేర్లు కనిపించడం లేదని, పట్టా భూములు నిషేదిత జాబితాలో పడ్డాయని, మ్యుటేషన్ పనులు పెండింగులో ఉంటున్నాయని ఇటీవల కాలంలో ఫిర్యాదులు వస్తున్న క్రమంలోనే రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ వాట్సాప్ నంబర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
ధరణి పోర్టల్‌లో తమ భూమి తమ పేరిట చూపించకపోవడంతో రిజిస్ట్రేషన్ పనులు నిలిచిపోయాయంటూ పలువురు రైతులు సోషల్ మీడియా ద్వారా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు ఫిర్యాదు చేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అంతిమంగా ఈ సమస్యలకు ఎప్పుడు పరిష్కారం ఆ దేవుడికి మాత్రమే తెలుసు.