Sanchar Saathi – Tafcop Portal: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు(Cyber Crime) పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. డిజిటల్ లావాదేవీలు(Digital Transactions) చేసే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మన కీలకమైన సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కిపోతోంది. ఇలాంటి విషయాలలో అనుభవం ఉన్నవారు కూడా మోసపోతున్నారు.
ఇటీవల ఏపీలో ఓ వ్యక్తి ఆధార్ కార్డుపై ఏకంగా 658 సిమ్‌కార్డులు యాక్టివేట్ అయి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాటిని గుర్తించిన టెలికాం శాఖ అధికారులు వాటన్నింటినీ బ్లాక్ చేశారు. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్న నేపథ్యంలో టెలికాం శాఖ కొత్త టెక్నాలజీ రూపొందించింది.
ఈ టెక్నాలజీ సహాయంతో ఒక వ్యక్తి తన ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ద్వారా తన ఆధార్ కార్డుపై ఇప్పటి వరకు ఎన్ని మొబైల్ నంబర్లు తీసుకున్నారో తెలుసుకోవాడమే కాకుండా.. ఎవరైనా మీ మొబైల్‌ను ఎవరైనా చోరీ చేసినా, పోగొట్టుకున్నా దాన్ని బ్లాక్ చేసుకునేలా టెలికాం శాఖ అవకాశం కల్పించింది.
మీ ఆధార్‌పై ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా..?
- మొదట https://www.sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
- ఇప్పుడు ‘బ్లాక్ యువర్ లాస్ట్/ స్టోలెన్ మొబైల్’, ‘నో యువర్ మొబైల్ కనెక్షన్’ అనే రెండు ఆప్షన్లు మీకు కనిపిస్తాయి.
- ఆ తర్వాత Know Your Mobile Connection ఆప్షన్ మీద క్లిక్ చేసి 10 అంకెల మొబైల్ నంబర్, ఓటీపీను నమోదు చేయాలి.
- ఇప్పుడు ఆ యూజర్ పేరిట ఉన్న మొబైల్ నంబర్ల జాబితా మీకు కనిపిస్తుంది.
- అందులో ఏదైనా నంబర్ మీది కాకపోయినా.. ప్రస్తుతం వినియోగించకపోయినా.. వాటిని బ్లాక్ చేసుకునే అవకాశం మీకు ఉంది.