How To Get Lost Property Documents: మన దేశంలో ఇల్లు, భూమికి ఉన్న వీలువ గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి భూములు, ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోతే? మనం పడే భాద మాటల్లో కూడా చెప్పలేము.
ఇక మనం ఏమి చేయలేము అని భయపడుతాం. తరతరాలుగా వస్తున్న ఆస్తి పత్రాలు పోయినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. పోయిన డాక్యుమెంట్స్‌ను చాలా సింపుల్‌గా ఎలా పొందాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
Tips To Get Lost Property Documents
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం
భూములు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు పోయినప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలి. ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే కాదు, పోగొట్టుకున్న మీ ఒరిజినల్ పత్రాలు తిరిగి పొందడానికి చాలా ఉపయోగపడుతుంది. పైగా మీకు చట్టపరమైన రక్షణ కూడా లభిస్తుంది.
ఇతరులు మీ ఆస్తులను తప్పుడు మార్గాల్లో ఉపయోగించుకోకుండా కూడా కాపాడుతుంది. మరీ ముఖ్యంగా మీ ఆస్తి పత్రాలు దొంగతనానికి గురైతే, పోలీసులు వాటిని పట్టుకుని మీకు అప్పగించే వీలుంటుంది. అయితే పోలీసులకు చేసిన ఫిర్యాదులో మీరు పోగొట్టుకున్న పత్రాలకు సంబంధించిన అన్ని వివరాలను చాలా స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఆస్తి పత్రాలు తిరిగి దక్కించుకునే అవకాశం ఉంటుంది.
పత్రికా ప్రకటన ఇవ్వాలి
మీ ఆస్తికి సంబంధించిన విలువైన పత్రాలు పోయినప్పుడు పత్రిక ప్రకటన ఇవ్వడం చాలా ముఖ్యం. చట్టపరంగానూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్పనిసరి. ఇది పబ్లిక్ డిక్లరేషన్‌లా పనిచేస్తుంది. పైగా ఎవరికైనా మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ దొరికితే తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక కనీసం ప్రముఖ న్యూస్ పేపర్లలో మీరు పొగొట్టుకున్న ఆస్తి పత్రాల గురించి ప్రకటన ఇవ్వాలి.
డూప్లికెట్ కాపీస్ కోసం దరఖాస్తు
ఎఫ్‌ఐఆర్ నమోదు, పత్రికా ప్రకటనలు చేసిన తర్వాత ఆ కాపీలను తీసుకొని మీ ఆస్తులను రిజిస్టర్ చేసిన సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లాలి. పూర్తి వివరాలతో ఒక అప్లికేషన్ నింపి, దానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్‌కు సంబంధించిన నఖలు కాపీలను జత చేసి ఇవ్వాలి. దీనితో మీ ఒరిజినల్ పత్రాలు పోయినట్లు ప్రకటించే అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.
దీని వల్ల ఇతరులు మీ ఆస్తులను తప్పుడు మార్గాల్లో క్లెయిమ్ చేసుకోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది, చట్టపరంగా కూడా మీకొక రక్షణ ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లోనే డూప్లికెట్ కాపీలు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనితోపాటు పోయిన పత్రాలను వెతకడానికి మీరు చేసిన ప్రయత్నాలను వివరిస్తూ ఓ అఫిడవిట్‌ను కూడా తప్పనిసరిగా ఇవ్వాలి.
వీటన్నింటినీ పరిశీలించి మీ భూములు, ఆస్తులకు సంబంధించిన డూప్లికెట్ కాపీలను సబ్-రిజిస్ట్రార్ జారీ చేస్తారు. మీ చట్టపరమైన యాజమాన్యాన్ని తిరిగి పునరుద్ధరిస్తారు. ఒకవేళ ఎప్పుడైనా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లభిస్తే, వాటిని కూడా మీకు అందజేస్తారు.