బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త!

0

బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం తీపికబురు అందించింది. డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) 1961 చట్ట సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు బ్యాంకు దివాళా తీసిన సందర్భాల్లో ఆ బ్యాంకులో తను డిపాజిట్‌ చేసిన మొత్తంలో కేవలం లక్ష రూపాయలను మాత్రమే డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) చట్టం కింద తిరిగి పొందగలిగేవాడు. అయితే ఈ మొత్తాన్ని ఐదు రెట్లు అంటే రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం డీఐసీజీసీ బిల్లు 2021ను ఆమోదించిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

కొన్ని ముఖ్యమైన అంశాలు

  • డీఐసీజీసీ బిల్లు 2021 ప్రకారం, మారటోరియం కింద ఉన్న డిపాజిట్‌ సొమ్ములో 5 లక్షల వరకూ ఇప్పుడు ఖాతాదారుడు 90 రోజుల్లో పొందగలుగుతారు.
  • పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంక్‌(పీఎంసీ), యస్‌ బ్యాంక్, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి, డిపాజిటర్లు తీవ్ర ఇబ్బందుల్లో పడిన నేపథ్యంలో కేంద్రం డీఐసీజీసీ చట్ట సవరణ బిల్లు, 2021కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదం వల్ల వేలాది మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చనుంది.
  • ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం, 5 లక్షల వరకూ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ ఉంది. అయితే బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దయి, లిక్విడేషన్‌ ప్రక్రియ ప్రారంభమైతేనే ఈ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అమల్లోకి వస్తుంది. సులభంగా చెప్పాలంటే ఒత్తిడిలో ఉన్న బ్యాంక్‌ నుంచి డబ్బు రాబట్టుకోవడానికి దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల కాలం పడుతోంది.
  • బ్యాంక్‌ డిపాజిటర్లకు బీమా కవరేజ్‌ అందించడానికి ఆర్‌బీఐ అనుబంధ విభాగంగా డీఐసీజీసీ పనిచేస్తోంది. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బ్యాంక్‌ బ్రాంచీలుసహా కమర్షియల్‌ బ్యాంకుల పొదుపు, ఫిక్స్‌డ్, కరెంట్, రికరింగ్‌ డిపాజిట్‌ హోల్డర్లందరికీ డీఐసీజీసీ కింద బీమా సదుపాయం లభిస్తుంది.
  • తాజా సవరణ ప్రకారం అసలు, వడ్డీ సహా గరిష్టంగా బ్యాంకుల్లో ప్రతి అకౌంట్‌ హోల్డర్‌ డిపాజిట్‌పై రూ.5 లక్షల వరకూ బీమా కవరేజ్‌ ఉంటుంది. అంటే వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు ఐదు లక్షలకు పైబడి ఉన్నా… మొత్తంగా ఐదు లక్షల వరకే బీమా లభిస్తుంది.
  • తాజా క్యాబినెట్‌ నిర్ణయంతో దేశంలోని దాదాపు 98.3% డిపాజిట్‌ అకౌంట్లకు పూర్తి ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ లభిస్తుంది. విలువలో చూస్తే 50.9% డిపాజిట్ల విలువకు కవరేజ్‌ లభిస్తుంది.

Support Tech Patashala

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here