British EV Startup One Moto: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకోవడంతో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే చాలా స్టార్టప్ సంస్థలు అన్నీ ఈ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా లండన్ కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ వన్ మోటో మన దేశంలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసేందుకు సిద్ద పడుతుంది. వన్ మోటో ఇండియా అధికారికంగా హైదరాబాద్‌లో తమ భారతీయ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ముంబైలో ఒక బ్రాంచీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
రూ.120,000 ధర
వచ్చే ఏడాది 2022 జనవరిలో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. భారత మార్కెట్లో Commuta, Electa, Byka అనే 3 మోడల్స్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. కమ్యుటా అనేది 75 కిలోమీటర్ల శ్రేణి గల ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ ను రూ.120,000 ధరకు అమ్మనున్నారు. ఇక బైకా, ఎలెక్టా స్కూటర్లు 4000కెడబ్ల్యు గల శక్తివంతమైన బాష్ మోటార్ సహాయంతో 150 కిలోమీటర్ల వరకు వెళ్లగలువు. ఈ బైకా, ఎలెక్టా స్కూటర్ల ప్రారంభ ధర రూ.1,85,000గా ఉంది. ఇండియన్ స్టార్టప్ ఎలైసియం ఆటోమోటివ్స్ భారతదేశంలో వన్ మోటో స్కూటర్లను లాంఛ్ చేస్తోంది.

(చదవండి: రూ.50 వేలకే మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్?)
150 కి.మీ రేంజ్
యూరప్ మార్కెట్లలో తన సత్తా చాటిన వన్ మోటో ఇప్పుడు భారతదేశంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దం అయ్యింది. వన్ మోటో బైకా, ఎలెక్టా స్కూటర్లు రెండు కూడా 3.3 సెకన్లలో 0-50 కిమీ వేగాన్ని అందుకోగలవు. వీటి టాప్ స్పీడ్ వచ్చేసి 85 కి.మీగా ఉంది. ఈ రెండు స్కూటర్లను ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ వెళ్లగలవు. దీనిని ఛార్జింగ్ చేయడానికి 4 గంటల సమయం పట్టనుంది. ఈ స్కూటర్ మార్కెట్లో ఉన్న ఓలా, ఏథర్ స్కూటర్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. ఈ స్కూటర్ చూడాటానికి అచ్చం బజాజ్ చేతక్ మోడల్ ని పోలి ఉంటుంది.
