ఇక గ్రామాల్లో ఇల్లు కట్టాలంటే టీఎస్ బిపాస్ అనుమతి తప్పనిసరి

0
TS-bPASS

Telangana State Building Permission Approval and Self Certification System(TS-bPASS): మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో భవన నిర్మాణాలు, లే అవుట్లకు అనుమతుల జారీ కోసం అమలు చేస్తున్న ‘టీఎస్‌-బీపాస్‌’విధానాన్ని ఇకపై గ్రామ పంచాయతీల పరిధిలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో అక్రమ, అనధికార లేఅవుట్లు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనకు రావడంతో, వాటిని కఠినంగా నియంత్రించడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల్లో కొత్త లేఅవుట్ల అనుమతులు టీఎస్‌-బీపాస్‌ ద్వారానే జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇటీవల మెమో జారీ చేశారు.

పంచాయతీల్లో లేఅవుట్ల అనుమతులకు ప్రస్తుతం అమలు చేస్తున్న డీపీఎంఎస్, ఈ-పంచాయతీ విధానాన్ని టీఎస్‌-బీపాస్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు పురపాలక కేంద్రాల్లోనే టీఎస్‌ బీపాస్‌(తెలంగాణ స్టేట్‌ బిల్లింగ్‌ పర్మీషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ప్‌ వెరిఫికేషన్‌ సిస్టం) అమల్లో ఉంది. తాజాగా గ్రామాల్లోనూ అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈనెల నుంచే అమలు చేయాలని ఆదేశాలు రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా ఇళ్ల నిర్మాణాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అనుమతుల జారీ ఇలా..
గ్రామాల్లో భవన నిర్మాణాలకు అనుమతిచ్చేందుకు జీఓ నంబరు 52ని జారీచేస్తూ పంచాయతీ రాజ్‌ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటి వరకు గ్రామాల్లో భవన నిర్మాణానికి పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే సర్పంచి, కార్యదర్శి పరిశీలించి ఈ-పంచాయతీ ద్వారా అనుమతి ఇచ్చేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం టీఎస్‌-బీపాస్‌ ద్వారా అనుమతి తీసుకోవాలి. ఇప్పటికే పురపాలక సంఘాల్లో ఈ విధానం అమలవుతోంది. ఇదే పద్ధతిని గ్రామాల్లోనూ అమలు చేయడం ద్వారా నిర్మాణాల వివరాలు, పన్ను వసూలు పకడ్బందీగా జరగనుంది.

దరఖాస్తుదారులు మీసేవ కేంద్రాల ద్వారా అన్ని రకాల ధ్రువపత్రాలు, ఇంటి ష్లాను పొందుపరచి టీఎస్‌ బీపాస్‌లో అప్‌లోడ్‌ చేయగానే సంబంధిత శాఖల అధికారులు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. పంచాయతీ రాజ్‌, నీటి పాదరుదల, ఇంజనీరింగ్‌ శాఖల పరిశీలన అనంతరం సంబంధిత దరఖాస్తుకు 21 రోజుల్లో అనుమతి లభిస్తుంది. అనుమతి లేని నిర్మాణాలు, నిబంధనలకు విరుద్దంగా నిర్మించినవి, ధ్రువపత్రాలు సక్రమంగా లేని కట్టడాలు ఉంటే వాటిని నోటీసు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాన్ని పాలకవర్గాలకు ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది.

అనుమతి అంత సులువు కాదు..
టీఎస్‌ బీపాస్‌ విధానంలో దరఖాస్తు చేయాలంటే అన్ని ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం గ్రామకంఠం ఆధారంగా లేదా తాత, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన స్థలాల్లో నిర్మాణాలు చేసుకుంటారు. దీని వల్ల దరఖాస్తుచేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొత్తగా తెచ్చిన చట్టంలో ఎల్‌ఆర్‌ఎస్‌ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ క్రమబద్ధీకరించాలి. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట రుసుం చెల్లించిన స్థలాలకు, సరైన పన్నులు చెల్లించినవారికే అనుమతులు ఇస్తారు.

జాప్యం చేసే అధికారులపై జరిమానాలు
టీఎస్‌-బీపాస్‌ విధానం కింద భవనాలు, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, ఇతర ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయని అధికారులపై జరిమానాలు విధించనున్నారు. జరిమానాల విధింపు త్వరలోనే అమల్లోకి రానున్నట్లు పురపాలక శాఖ టీఎస్‌-బీపాస్‌ పోర్టల్‌లో ప్రకటించింది. టీఎస్‌-బీపాస్‌ చట్టం మేరకు లేఅవుట్ల అనుమతులకు వచ్చే ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా లేఅవుట్‌ కమిటీ ముందు పెడతారు. ఈ కమిటీ సిఫారసుల మేరకు సంబంధిత గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పేరు మీద అనుమతులు జారీ చేయనున్నారు.

అక్రమ లేఅవుట్లకు 2 నెలల సమయం
పల్లె, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అక్రమ లేఅవుట్లపై జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌(డీటీఎఫ్‌) కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఏర్పాటైన అక్రమ లేఅవుట్లకు నోటీసులు జారీ చేసి టీఎస్‌-బీఎస్‌ కింద రెండు నెలల్లోగా క్రమబద్ధీకరణ/అనుమతులు తీసుకునేలా ఆదేశించాలని, విఫలమైన పక్షంలో చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్క్వాడ్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు అక్రమ లేఅవుట్ల తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్లను కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here