గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది జీవితాలు ఆగమ్యగోచారంగా మారిన సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా చెప్పాలంటే చిన్న చిన్న సంస్థలలో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగుల తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగం కోల్పోయి తిరిగి విధుల్లో చేరిన ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఈపీఎఫ్ఓ చందాదారులకు 2022 వరకు ఉద్యోగులు చెల్లించే పీఎఫ్ మొత్తంతో పాటు యాజమాన్యాలు చెల్లించే పీఎఫ్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఈపీఎఫ్ఓ కింద నమోదు చేసుకున్న చిన్న సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి మాత్రమే ఈ నిబందన వర్తిస్తుందని తెలిపారు. అయితే, ఈ అవకాశం 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. రూ.15 వేలలోపు వేతనం కలిగిన వారికి ఈ ప్రయోజనం ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి గతజూన్ నెలలో 12.83 లక్షల మంది చందాదారులు కొత్తగా చేరారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. జూన్‌లో కరోనా వైరస్ తగ్గడంతో ఉద్యోగ కల్పనకు దారితీసినట్లు పేర్కొంది. ఈపీఎఫ్ఓ సభ్యులకు వారి పదవీ విరమణ చెందితే ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ప్రయోజనాలు, సభ్యుడు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకు బీమా ప్రయోజనాలను అందిస్తుంది.