రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నెలాఖరులో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
‘మూడు వ్యవసాయ సాగు చట్టాలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాం. ఈ నెలాఖరులో మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి, రాజ్యాంగ పరమైన ప్రక్రియ ప్రారంభిస్తాం. వ్యవసాయ బడ్జెట్‌ను 5 రేట్లు పెంచాం, తక్కువ ధరకే విత్తనాలు అందేలా కృషి చేస్తాం, ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తాం. దేశ రాజదని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన విరమించాలి, మిమ్మల్ని నొప్పించి ఉంటే మీకు క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని మోదీ తెలిపారు.