దేశంలో రోజు రోజుకి పెరిగి పోతున్న పెట్రోల్, డీజిల్, వంట నూనె, ఉల్లిపాయ ధరలతో భాదపడుతున్న సామాన్యుడి నెత్తి మీద మరో భారీ పిడుగు పడే అవకాశం కనిపిస్తుంది. వచ్చే నెల నవంబర్ మొదటి వారంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.100కి పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఇంధన మార్కెట్ నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పటికే పెరిగిపోతున్న నిత్యావసర ధరలతో చితికిపోతున్న సామన్యుడి జీవితం ఇక దిన దిన గండంగా మారే అవకాశం ఉంది. పెరిగి పోతున్న ధరల వల్ల ఏర్పడుతున్న నష్టాలను పూడ్చుకునేందుకు ఇంధన కంపెనీలు ధరల పెంపు ఆలోచనలో ఉన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
సౌదీ ఎల్‌పీజీ రేట్లు ఈ నెలలో టన్నుకు 60 శాతం పెరిగి 800 డాలర్లకు చేరుకోగా, అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ కు 85.42 అమెరికన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు గరిష్టా స్థాయికి పెరగడంతో ఎల్‌పీజీ అమ్మకాలపై వస్తున్న నష్టాలు సిలిండర్‌కు రూ.100కు పైగా పెరిగినట్లు వారు తెలిపారు.ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాయితీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించకపోవడంతో చమరు కంపెనీలు ఆ భారాన్ని కేంద్రమే మేయలని పేర్కొంటున్నాయి. లేకపోతే, ఆ భారాన్ని ప్రజలపై వేసేందుకు సిద్దంగా ఉన్నట్లు కేంద్రానికి సూచిస్తున్నాయి.
గతంలో సిలిండర్‌పై కేంద్రం మూడొందల వరకు రాయితీ ఇవ్వగా.. ఇప్పుడు నామమాత్రంగా ఇస్తూ కేంద్రం సరిపెడుతోంది. అక్టోబర్ 6న 14 కేజీల గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా 15 రూపాయలు పెంచడంతో హైదరాబాద్ లో వంట గ్యాస్ ఎల్‌పీజీ ధర రూ.950కి చేరుకుంది. ఒక్క ఏడాదిలోనే గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 300 రూపాయలు పెరిగింది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. దీంతో వంటింట్లో గ్యాస్ ముట్టించాలంటే మహిళలకు ముచ్చెమటలు పడుతున్నాయి.