చైనాతో సరిహద్దుల్లో ఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు చెందిన యాప్స్ పై నిషేదం విధించిన సంగతి మనకు తెలిసిందే. అందులో ప్రపంచ వ్యాప్తంగా భాగా గుర్తింపు పొందిన టిక్ టాక్, పబ్జీ గేమ్ వంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి. టిక్ టాక్ భారత్ లో నిషేదం విధించినప్పటి నుండి చాలా కంపనీలు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.. ఇప్పుడు ఆ జాబితాలో యూట్యూబ్ కూడా చేరింది. తాజాగా యూట్యూబ్ “యూట్యూబ్ షార్ట్స్” పేరుతో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. త్వరలోనే ఈ ఫీచర్ ని భారత్ లో పరీక్షించనున్నారు. దీని తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని యూట్యూబ్ తన బ్లాగ్ లో తెలిపింది. దీని కోసం కొత్త యాప్ తీసుకురాకుండా యూట్యూబ్ లోనే కొత్త ఫీచర్ ను తీసకొస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. త్వరలో ఐఓఎస్ యూజర్లకు కూడా తీసుకొస్తామని తెలిపింది.
మనం టిక్ టాక్ మాదిరిగానే 15 సెకండ్ల నిడివిగల షార్ట్ వీడియోను పోస్ట్ చేయవచ్చు. ముందుగా మనం వీడియోను రికార్డు చేసి దానికి స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్, మ్యూజిక్ లైబ్రరి నుండి సౌండ్ ట్రాక్ లను విడియోకి జత చేయవచ్చు. దీని ద్వారా మనం వీడియోలను సులభంగా రికార్డు చేసుకోవడానికి టైమర్ అండ్ కౌంట్‌డౌన్, మల్టీ సెగ్మెంట్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. మల్టీ సెగ్మెంట్ కెమెరాలో యూజర్స్ వివిధ రకాల వీడియోలను ఒక చోటికి చేర్చుకోవచ్చు. ముందుగా షార్ట్స్ బీటా వెర్షన్‌ని భారత్‌లోని వీడియో క్రియేటర్స్, ఆర్టిస్ట్‌లతో కలిసి పరీక్షించనున్నట్లు యూట్యూబ్ తెలిపింది. భవిష్యత్ లో మరిన్ని ఫీచర్లు జత చేసి ఎక్కవ మందికి చేరుకోవాలని భావిస్తుంది.