“పాడి పంటల్ని మించిన సిరిసంపదలు లేవండి. వాటిని నమ్ముకుంటే ఆదాయంతో పాటు ఆత్మసంతృప్తినీ కూడా బోనస్‌గా ఇస్తాయి’’ అంటారు కిషోర్ ఇందుకూరి. అదే ఆత్మసంతృప్తి కోసం కష్టపడి చదువుకున్న చదువును కలలుగన్న ఉద్యోగాన్ని తృణప్రాయంలా వదిలిపెట్టిన ఈ ఐఐటి ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్ తిరిగి తన ప్రస్థానాన్ని ఎబిసీడీ నుంచి మొదలుపెట్టడానికి కూడా వెనుకాడలేదు. సున్నా నుంచి మొదలై అనతి కాలంలోనే 13వేల మంది ప్రత్యక్ష వినియోగదారులు కలిగిన ఏకైక సంస్థగా శ్రమకు తగ్గ విజయం స్వంతమైనా విశ్రమించేది లేదంటున్న సిథ్స్ డైరీ ఫార్మ్ నిర్వాహకులు ,యువ వ్యాపారవేత్త కిషోర్ ఇందుకూరి.
అతనిది పశ్చిమగోదావరి జిల్లా. పచ్చని పాడి పంటల నిలయం. చాలా మంది మధ్యతరగతి యువకుల్లానే అమెరికాలో చదువు, ఉద్యోగాల గురించి కలలు కన్నాడు. హైదరాబాద్ వచ్చేసి కాలేజ్ చదువుతో ప్రారంభించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మస్సాచుసెట్స్‌లో పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్, పిహెచ్‌డి చేసేదాకా చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా ప్రయాణం సాగింది. అమెరికాలో అగ్రగామి కంపెనీ ఇంటెల్‌లో ఉద్యోగం ఆరేళ్ల పాటు చేశాడు. ఉద్యోగబాధ్యతల్లో భాగంగా పలు దేశాలు తిరిగినప్పుడు ఎన్నో రకాల తయారీ సంస్థల కార్యకలాపాలు దగ్గర నుంచి చూశాను. ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ విలువ తెలిసొచ్చింది. అంతే కాకుండా అప్పటికే స్వదేశం మీదకు బాగా గాలి మళ్లింది అని తెలిపాడు.
క్విట్ అమెరికా.. కమాన్ ఇండియా..
మనదేశం వైపు మనసు పిలిచింది. జాబ్ వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. సహజంగానే అందరూ వారించారు. నాకలలు, అదృష్టాలు గుర్తు చేశారు. అయితే అప్పటకే నాకు కావాల్సింది ఏమిటో నాకు అర్ధమైంది. మా అత్తగారి కుటుంబం కర్ణాటకలో ఉంటుంది. అక్కడికి వెళ్లి వ్యవసాయం చేశాను. కొన్ని నెలల తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడాలనుకున్నప్పుడు ఏం చేయాలా అని ఆలోచించా. సన్నిహితులు మళ్లీ గచ్చిబౌలి హైటెక్ విశేషాలు చెప్పి నాకు క్షణాల మీద ఉద్యోగం వస్తుందంటూ చెప్పబోయారు. అయితే అప్పటికే నా మనసు ప్రైవేటు కొలువుకు శాశ్వత సెలవు పెట్టేసింది. అప్పుడే గోమాత గుర్తొచ్చింది. వెంటనే కోయంబత్తూర్‌లో 20 ఆవులు కొనుగోలు చేసి హైదరాబాద్ బాట పట్టాను. గచ్చిబౌలిలోని చిన్నపాటి స్థలంలో డైరీ ఫార్మ్ ఏర్పాటు చేశాను.

తప్పలేదు ఆపసో‘పాలు’ …
చాలా పేరున్న సంస్థలు రంగంలో ఉండడంతో ప్రారంభంలో మా పాలని వినియోగదారులకు చేరువ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మరోవైపు అప్పటికే ఆవుల్ని కొనుగోలు చేసి ఉండడంతో పాలు వృధా పోతుండేవి. గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉదయాన్నే చిన్న చిన్న టెంట్స్ వేసుకుని మా పాల గురించి చెప్పుకొచ్చాను. అలా 20 మంది కస్టమర్లతో మా ప్రయాణం ఆరంభమైంది. ‘‘మీరు స్వయంగా చిన్నప్పుడు పాలు పితికి తాగితే ఎటువంటి రుచిని అనుభూతించారో అదే తిరిగి మీకు అందిస్తాననే’’ నా హామీ పలువురిని ఆకట్టుకుంది. నేరుగా వినియోగదారుల ఇళ్లకే డైరీ ఫార్మ్ నుంచి పంపడంతో పాటు పాలు బాగోలేదంటే రీప్లేస్ చేస్తాం’’ అంటూ గ్యారెంటీ ఇచ్చాం. తొలుత మా జర్నీ నిదానంగా ప్రారంభమైనా.. తర్వాత స్వల్పకాలంలోనే ఊపందుకుంది..
రూ.44 కోట్ల సంస్థగా సిద్స్ డైరీ ఫార్మ్
నా దగ్గరున్న మొత్తం సేవింగ్స్, కుటుంబం ఇచ్చిన ఆర్ధిక సహకారంతో తొలిపెట్టుబడి రూ.1 కోటి పెడితే.. ఆ తర్వాత మరో రూ.2 కోట్లు, బ్యాంక్‌ల నుంచి రూ.1.3 కోట్ల టర్మ్ లోన్ తీసుకోగలిగాం. గత 2016లో నా కుమారుడు సిద్ధార్ధ పేరిట సిద్స్ డైరీ ఫార్మ్ ఏర్పాటైంది. బ్యాంక్ లోన్ దొరికాక 2018లో మేం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న షాబాద్ పట్టణంలో పూర్తి స్థాయి శాశ్వత తయారీ కేంద్రాన్ని నెలకొల్పాం. ఇప్పుడు దాదాపు 120 మంది సిబ్బందితో ఉన్న మా డైరీ ఫార్మ్.. 13వేల మంది ప్రత్యక్ష వినియోగదారుల్ని కలిగి ఉన్న ఏకైక సంస్థ. అలాగే గత ఏడాది రూ.44 కోట్ల టర్నోవర్ సాధించాం. పనీర్, కర్డ్, బట్టర్..వంటి డైరీ ప్రొడక్ట్స్ కూడా ప్రారంభించాం. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలనుకుంటున్నాం.

వినూత్నం.. విజయం…
పాల వ్యాపారంలో దిగ్గజాలను తట్టుకుని మరీ స్వల్ప కాలంలో మేం విజయం సాధించగలగడానికి అవలంబిస్తున్న పారదర్శకత, వైవిధ్య వ్యాపార శైలులే కారణం. మిగిలిన డైరీ ఫార్మ్స్‌కు భిన్నంగా ఆవు/గేదె డైరీ ఆవు పాలు, ఆవు పెరుగు అలాగే గేదె పాలు గేదె పెరుగు ఇలా.. ఉత్పత్తులను వేర్వేరుగా అందిస్తున్నాం. నిల్వపదార్ధాలను గానీ యాంటీ బయాటిక్స్‌ను గానీ హార్మోన్స్‌ను గానీ పాల ఉత్పాదనకు ఊతం చేసుకోవడం లేదు. మొబైల్ యాప్ ద్వారా కూడా పాలను విక్రయిస్తున్నాం.
నెలవారీగా లేదా కొన్ని రోజుల కోసం సబ్‌స్క్రైబ్ చేసుకుని వినియోగదారులు నేరుగా మా నుంచి గానీ లేదా స్విగ్గీ, అమెజాన్, క్యూబ్యాగ్, బిగ్ బాస్కెట్ వంటి యాప్స్‌లోనూ మా ఉత్పత్తులు లభిస్తాయి. పాలు బాగాలేదని ఫిర్యాదు చేస్తే పాల నాణ్యతకు సంబంధించిన అనేక పరీక్షల్లో ఏదైనా సరే ఇంటికే వచ్చి చేయడంతో పాటు రీప్లేస్ చేస్తామని హామీ ఇస్తున్నాం. మా పాల నాణ్యత గురించి ఒక్కటే ఉదాహరణ చెబుతా మా వినియోగదారులకు నెయ్యి కొనాల్సిన అవసరం లేదని. కార్పోరేట్ ఉద్యోగాన్ని వదిలేసినా.. కల్తీలేని పాలను అందరికీ అందిస్తున్నాననే ఆనందాన్ని, ఆదాయాన్ని.. వెలకట్టలేని ఆత్మసంతృప్తినీ అందుకుంటున్నా’ అని అన్నారు.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.