ఇప్పటి వరకు టెలికాం రంగంలో పెను సంచాలనాలను సృష్టించిన జియో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కూడా పెను సంచాలనాలను సృష్టించేందుకు తయారు అవుతుంది. ఇప్పటికే మార్కెట్లో టెలికాం, బ్రాడ్ బ్యాండ్ వంటి రంగాలలో తనకంటూ మంచి మార్కెట్ ను సంపాదించుకున్న జియో. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కూడా దూసుకెళ్లాలని ఆశిస్తుంది. ఇప్పటి వరకు అందిన తాజా నివేదికల ప్రకారం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ ద్వారా బడ్జెట్ లో 10 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ల తయారు చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా డేటా ప్యాక్ లను కూడా అందించాలని భావిస్తుంది. బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం డేటా ప్యాక్‌లతో కూడిన100 మిలియన్లకు పైగా ఫోన్‌లను 2020 డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయనుంది. జియో కోసం “4 జీ లేదా 5 జీ” స్మార్ట్‌ఫోన్‌లకోసం గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను నిర్మిస్తోందని ఇటీవల రిలయన్స్ అధినేత బిలియనీర్ ముకేశ్ అంబానీ ప్రకటించడం గమనార్హం.
ఇప్పటికే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో చైనాకు చెందిన Vivo, Xiaomi, Redmi, Oppo, Honor వంటి సంస్థలు భారీ షేర్ ను కలిగి ఉన్నాయి. వీటికి ధీటుగా ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ తో జియో మార్కెట్లోకి రావాలని భావిస్తుంది.
దేశీయ టెలికాం రంగంలోకి సునామీలా దూసుకొచ్చిన జియో, ఇప్పుడు కూడా ముకేశ్ అంబానీ సారధ్యంలోని జియో స్మార్ట్‌ఫోన్ తయారీ విభాగంలోతన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రణాళికలను రచిస్తోంది. కాగా ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ తన డిజిటల్ యూనిట్లో 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు జూలైలో రిలయన్స్ ప్రకటించింది. జియో ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 33 శాతం వాటా విక్రయం ద్వారా 1.52 ట్రిలియన్ డాలర్లు (20.22 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులను సాధించింది. ఫేస్‌బుక్, ఇంటెల్, క్వాల్కమ్‌లతో సహా ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను సాధించిన సంగతి తెలిసిందే.
కొత్తగా ఒక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో వెచ్చించలేని గ్రామీణ ప్రాంత వినియోగదారులకు, పేద వర్గాలకు ఇది అనుకూలంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ కొత్త ఫోన్ లో Whatsapp, Youtube, Facebook వంటి అన్ని ముఖ్యమైన అప్లికేషన్స్ తో పాటు Google Play Store నుండి కావలసిన అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.