వంటనూనె వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు శుభవార్త తెలిపాయి. అదానీ విల్మార్, రుచి సోయా, ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ అయిల్‌తో సహా ఇతర ప్రధాన వంటనూనె కంపెనీలు తమ అయిల్ ధరలను గరిష్ట రిటైల్ ధర(ఎంఆర్పీ) మీద 10-15% తగ్గించినట్లు పేర్కొన్నాయి. వంటనూనె వినియోగదారులకు ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో ధరలను కూడా తగ్గించినట్లు కంపెనీలు పేర్కొన్నాయి.
ముడి పామాయిల్, ముడి సోయా-బీన్ ఆయిల్, ముడి పొద్దు తిరుగుడు విత్తన అయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకన్నీ 2.5% నుండి సున్నాకు తగ్గించింది. ముడి పామాయిల్ మీద వ్యవసాయ పన్నును 20% నుంచి 7.5% శాతానికి తగ్గించింది. ముడి సోయా-బీన్ చమురు, ముడి పొద్దుతిరుగుడు అయిల్ రెండింటిపై విధించే వ్యవసాయ పన్నును 20% నుంచి 5% శాతానికి కేంద్రం తగ్గించింది. ఈ పన్నుల తగ్గుదల మార్చి 2022 చివరి వరకు అమల్లోకి ఉంటాయి. ఇటీవల, కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే కొన్ని రోజుల క్రితం ఆయిల్ కంపెనీల అధినేతలను పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు.
(చదవండి: తెలంగాణ రైతులకు శుభవార్త.. నేటి నుంచి ఖాతాల్లో డబ్బులు జమ!)
కేంద్ర ప్రభుత్వం తగ్గించిన దిగుమతి సుంకాల మేరకు ఆయిల్ ధరలను తగ్గించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అదానీ విల్మార్ (ఫార్చ్యూన్ బ్రాండ్లపై), రుచి సోయా(మహాకోష్, సన్ రిచ్, రుచి గోల్డ్ న్యూట్రెల్లా బ్రాండ్లు), ఎమామి(హెల్తీ అండ్ టేస్టీ బ్రాండ్లు), బుంగే(డాల్డా, గగన్, చంబల్ బ్రాండ్లు), జెమిని (ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్లు) ధరలను తగ్గించాయని కేంద్రం తెలిపింది. దిగుమతి సుంకాలు తగ్గించడంతో ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ అయిల్ ధర తగ్గిందని కంపెనీ పేర్కొంది. లీటరు ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ అయిల్‌ను గరిష్టంగా రూ.140లు, అంతకంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర రెడ్డి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.