పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపుపై కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందనాలపై విధిస్తున్న సుంకాల తగ్గింపు యోచన లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 16న స్పష్టం చేశారు. ఎక్సైజ్ సుంకాలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఆర్థికమంత్రి ఈ విషయాన్ని తెలిపారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం ఇంధన ధరలకు సంబంధించి భారీ సబ్సిడీలు ఇచ్చినట్లు ఆమె పేర్కొంటూ.. ఇందుకు సంబంధించి చెల్లింపు భారాలు ఇప్పటికీ మోస్తున్న కారణంగా ఎక్సైజ్ సుంకాల కోత అంశం ప్రస్తుతం పరిశీలనలో లేనట్లు అన్నారు.
ఇంధనం కొనుగోళ్లు-వ్యయాల మధ్య ఉన్న తేడాను తగ్గించడానికి ప్రభుత్వ రంగ కంపెనీలకు గత యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన రూ.1.34 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్లకు సంబంధించి గత ఏడేళ్లలో ప్రభుత్వంపై రూ.70,196 కోట్లకుపైగా వడ్డీ భారం పడిందని, ఇంకా రూ.1.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు ఆమె తెలిపారు. ‘‘ఆయిల్ బాండ్ల భారాన్ని భరించాల్సిన పరిస్థితి లేకపోతే, ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఉండేవాళ్లం’’ అని ఆమె ఈ సందర్భంగా వివరించారు. రూ.1.34 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ల విలువలో రూ.3,500 కోట్ల అసలును మాత్రమే ఇప్పటివరకూ చెల్లించడం జరిగిందన్ని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం మధ్య ఇంకా రూ.1.3 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 ఎక్సైజ్ సుంకం భారం పడుతుంది.