ఇల్లు కట్టుకోవాలనే వారికి.. ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్!

0
SBI-Home-Loan

చౌక గృహ రుణ మార్కెట్‌లో మరింత రాణించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కీలక ముందడుగు వేసింది. ఐదు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(హెచ్‌ఎఫ్‌సీ)లతో సహ-రుణ ఒప్పందాలను(కో-లెండింగ్‌) కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు గృహ రుణాలు పొందలేని అసంఘటిత, అల్పాదాయ వర్గాలకు రుణాలు అందజేసేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు వివరించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ విభాగాల్లో రుణ మంజూరీలకు కృషి చేయనున్నట్లు తెలిపింది.

ఐదు సంస్థలూ ఇవీ..
కీలక ప్రాధాన్యత గల ఈ రంగంలో రుణాల అందజేయడానికి బ్యాంకులు, హెచ్‌ఎఫ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యలో ఎస్‌బీఐ తాజా అవగాహనలు కుదుర్చుకుంది. ఆర్థిక వ్యవస్థలోని అట్టడుగు, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారికి తక్కువ వడ్డీకి రుణాలు మంజరూ చేయాలనేది ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. ఎస్‌బీఐ ఒప్పందం చేసుకున్న ఐదు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్, ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌ ఫైనాన్స్, శ్రీరామ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, ఎడెల్వీస్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, కాప్రి గ్లోబల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లు ఉన్నాయి.

చౌక గృహాల కొరత భారతదేశానికి, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్‌), సమాజంలోని అట్టడుగు, అసంఘటిత వర్గాలకు ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. ఈ సవాళ్లు తగ్గించడానికి ఎస్‌బీఐ తన వంతు కృషి చేయనుంది. ఐదు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలతో సహకారం బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ రుణ పంపిణీ నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తుంది. 2024 నాటికి అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ దార్శినికత దిశలో పురోగతికి ఈ ఒప్పందాలు దోహదపడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here