ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల రెంటల్ స్టార్టప్ సంస్థ బౌన్స్ కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీపై, బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. వచ్చే 12 నెలల్లో ఇందుకు సంబంధించి 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 742 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ వివేకానంద హలికెరె ఈ విషయాలు తెలిపారు. ఈ చివరి వరకు తమ తొలి స్కూటర్‌ను రెండు వేరియంట్స్‌లో ఆవిష్కరిస్తామని, ఆ తర్వాత ప్రీ-బుకింగ్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి డెలివరీ ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు.
ప్రీ-బుకింగ్ సమయంలో సుమారు ఒక లక్ష పైగా వాహనాలకు ఆర్డర్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. బ్యాటరీతో కలిపి వాహనం ధర రూ 70,000 లోపు, బ్యాటరీ లేకుండా సుమారు రూ.50,000లోపు తీసుకొనిరానున్నట్లు తెలిపారు. బ్యాటరీతో పాటు తీసుకుంటే పోర్టల్ చార్జర్ ద్వారా ఇంటి వద్దే చార్జింగ్ చేసుకునే వీలు ఉంటుందన్నారు. అదే బ్యాటరీ లేని వేరియంట్ తీసుకుంటే.. బ్యాటరీస్ యాజ్ ఏ సర్వీస్ విధానంలో తాము నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్లలో బ్యాటరీ మార్పిడి చేసుకోవచ్చని వివేకానంద చెప్పారు. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. దీని టాప్ స్పీడ్ 40-50 కి.మీగా ఉండనుంది.