మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు శుభవార్త. కొత్త గృహ రుణాలు తీసుకునే వారికోసం భారీగా వడ్డీ రేట్లను తగ్గించింది. అలాగే, గృహ రుణ మార్కెట్‌లో మెజారిటీ వాటా దక్కించుకోవడం కోసం దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రుణ రేటు తగ్గింపుతో సహా రుణ గ్రహీతలకు చాలా ఆఫర్లను ప్రకటించింది. అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి గృహ రుణాలు ఇవ్వనున్నట్లు బ్యాంక్ తెలిపింది.
ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాల కోసం ఒక వినియోగదారుడు 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. అయితే, ఇప్పుడు అలాకాకుండా చక్కటి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 45 బేసిస్ పాయింట్ల(100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గించింది. దీనివల్ల 30 సంవత్సరాల లోపు రుణం చెల్లించే విధంగా రూ.75 లక్షల లోన్ తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకు పైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం వడ్డీరేటు వేతన జీవులతో పోల్చితే, ఎటువంటి వేతనం పొందనివారు 15 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా వీరి మధ్య ఉన్న రుణ రేటు వ్యత్యాసాన్ని ఎస్‌బీఐ తొలగించింది. రుణ బ్యాలన్స్ బదలాయింపుల విషయంలోనూ 6.70 శాతం వడ్డీరేటు అమలవుతుంది. అలాగే, ముఖ్యంగా ప్రాసెసింగ్ ఫీజునూ బ్యాంకింగ్ దిగ్గజం రద్దు చేసింది.