ఇప్పటికే ఎన్నో రికార్డులు తన పేరిట సొంతం చేసుకున్న టాటా మరో రికార్డుపై కన్నేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించాడనికి సిద్ధమైంది. దీంతో పాటు అక్కడ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ని కూడా ఏర్పాటు చేయనుంది. లేహ్ లో 50 మెగావాట్ల సోలార్ ప్లాంట్ తో పాటు 50 మెగావాట్ల బ్యాటరీ నిల్వతో కూడిన సిస్టమ్ ను టాటా పవర్ సోలార్ ఏర్పాటు చేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. లడఖ్ లో 13 గిగావాట్ అవర్(జీడబ్ల్యుహెచ్) గ్రిడ్-స్కేల్ బ్యాటరీ నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్రం అతిపెద్ద గ్లోబల్ టెండర్ కోసం బిడ్లను ఆహ్వానిస్తుంది.
2023 వరకు ప్రాజెక్టు పూర్తి
“టాటా పవర్ యాజమాన్యంలోని సబ్సిడరీ కేంద్ర పాలిత ప్రాంతమైన లదాఖ్‌లో లేహ్ లోని ఫ్యాంగ్ గ్రామంలో 50ఎమ్ డబ్ల్యు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్(బీఈఎస్ఎస్) గల 50ఎమ్ డబ్ల్యుపీ సోలార్ పీవీ ప్లాంట్ ప్రాజెక్టును” దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ఆర్డర్ విలువ రూ.386 కోట్లు. ఈ ప్రాజెక్ట్ ను మార్చి 2023 వరకు పూర్తి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ద్వారా వ్యూహాత్మక ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక జీడబ్ల్యుహెచ్(1,000-ఎమ్ డబ్ల్యుహెచ్) బ్యాటరీ సామర్థ్యం కలిగిన ప్లాంట్ ద్వారా ఒక గంట పాటు 1 మిలియన్ గృహాలకు, సుమారు 30,000 ఎలక్ట్రిక్ కార్లకు పవర్ ఇవ్వవచ్చు.

ప్రపంచ రికార్డు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటైన కేంద్ర పాలిత ప్రాంతమైన లదాఖ్‌లో కొత్తగా సోలార్ పవర్ ప్లాంటును టాటా పవర్ సంస్థ నిర్మించనుంది. లదాఖ్ ప్రధాన పట్టణమైన లేహ్ సమీపంలో ఫ్యాంగ్ అనే గ్రామం సమీపంలో భూమి నుంచి 3.6 కి.మీ ఎత్తులో ఈ సోలార్ పవర్ స్టేషన్‌ను నిర్మించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పిన సోలార్ పవర్ స్టేషన్‌గా స్విట్జర్లాండ్‌లోని జుంగ్‌ఫ్రాజోక్ గుర్తింపు ఉంది. దీనిని 1991లో ఈ పవర్ స్టేషన్‌ని భూమి నుంచి 3,454 మీటర్ల ఎత్తులో నెలకొల్పారు. కఠినమైన శీతాకాలంలో రక్షణ సంస్థలతో పాటు లేహ్, కార్గిల్ జిల్లాల ప్రజలకు విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం ఈ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తోంది.