కొన్ని వందల ఏళ్ల నాటి ఇంజనీరింగ్ నైపుణ్యం.. నీటిలో తేలియాడే ఇటుకలు, అద్దంలా మన ప్రతిబింబాన్ని చూపే నల్లరాతి శిల్పాలు, ఇసుకను పునాది కింద కుషన్‌గా వాడిన శాండ్‌బాక్స్ టెక్నాలజీ, సూది మొన కంటే సన్నటి సందులతో నగిషీలు.. అద్భుతాలన్నీ ఒకచోట పేర్చిన గొప్ప రామప్ప దేవాలయానికి ‘ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో)’ గుర్తింపు లభించింది. జూలై 25న చైనాలోని వూహాన్ కేంద్రంగా జరిగిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశంలో.. 28 సభ్య దేశాలలో మెజారిటీ దేశాలు రామప్ప ఆలయానికి ప్రపంచ హోదా ఇచ్చేందుకు అనుకూలంగా ఓటు వేశాయి. అనంతరం దీనికి సంబంధించి యునెస్కో అధికారిక ప్రకటన చేసింది.

2015 నుంచి ప్రయత్నాలు మొదలు
రామప్ప కట్టడానికి ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015 నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు పంపింది. కానీ నిర్ణీత నమూనాలో డోజియర్ (దరఖాస్తు) రూపొందకపోవడంతో తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే లోపాలను సవరించి మరో డోజియర్‌ను పంపారు. దాన్ని యునెస్కో పరిశీలనకు స్వీకరించింది. ప్రముఖ నర్తకి, యునెస్కో కన్సల్టెంట్‌గా ఉన్న చూడామణి నందగోపాల్ రెండు రోజుల పాటు రామప్ప ఆలయాన్ని చేరుకొని అక్కడ ఉన్న కట్టడాలను పరిశీలించి.. శిల్పాలు, ఇతర ప్రత్యేకతలను అందులో పొందుపర్చారు. తర్వాత యునెస్కో అనుబంధ ‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మ్యాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకొమాస్)’ ప్రతినిధి వాసు పోష్యానందన అనే అధికారి 2018లో రామప్ప ఆలయాన్ని సందర్శించారు.

ఇక్కడే మూడు రోజులపాటు ఉండి.. ఆలయం ప్రత్యేకతలను, యునెస్కో గైడ్‌లైన్స్ ప్రకారం పరిస్థితులు ఉన్నాయా అన్న అంశాలను పరిశీలించి ఆ తర్వాత నివేదికను యునెస్కోకు నివేదిక ఇచ్చారు. తర్వాత యునెస్కో ప్రధాన కార్యాలయం గల ప్యారిస్‌లో జరిగిన సదస్సుకు రాష్ట్రం నుంచి పురావస్తుశాఖ అధికారులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ప్రతినిధులు వెళ్లి మరిన్ని వివరాలు అందజేశారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కేలా చూడాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.
ఆక్రమణలే అడ్డంకి
నిజానికి ప్రపంచ వారసత్వ హోదా కోసం ఉమ్మడి ఏపీ రాష్ట్రం సమయంలోనే చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ సమాధులతో కూడిన ఒక ప్రతిపాదన పంపారు. హైదరాబాద్‌కు వచ్చిన యునెస్కో ప్రతినిధి బృందం.. ఆ కట్టడాల చుట్టూ ఉన్న ఆక్రమణలు చూసి నివ్వెరపోయి, ప్రతిపాదన సమయంలోనే తిరస్కరించింది. మళ్లీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయాలను ఉమ్మడిగా ప్రతిపాదించింది. కానీ మళ్లీ అదే సమస్య ఎదురైంది. వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట చుట్టూ భారీగా ఆక్రమణలు ఉండటం, సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో వాటిని కూడా యునెస్కో తిరస్కరించింది.

చివరకు ఆక్రమణల బెడద లేని రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించాలని అధికారులు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ‘ద గ్లోరియస్ కాకతీయ టెంపుల్స్ అండ్ గేట్ వే’ పేరుతో కొత్త ప్రతిపాదన పంపారు. ఇందులో ‘కేంద్ర పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ)తోపాటు వరంగల్ కేంద్రంగా ఉన్న కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కీలకంగా వ్యవహరించింది. 2019లో యునెస్కో ప్రతినిధుల బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించి పరిరక్షణకు కొన్ని సూచనలు చేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పలు నిర్ణయాలు తీసుకుంది. ఆలయం చుట్టూ బఫర్ జోన్ ఏర్పాటు చేసింది. సమీపంలోని ఆలయాలను రామప్ప పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రత్యేక అభివృద్ధి అథారిటీ, కమిటీలను నియమించింది.
ఏఎస్‌ఐ పరిధిలో రామప్ప కట్టడం
ప్రస్తుతం రామప్ప కట్టడం కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఏఎస్‌ఐ పరిధిలో ఉంది. కేవలం కట్టడం పర్యవేక్షణ మాత్రమే దానిది. మిగతా వసతుల కల్పన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. రెండేళ్ల క్రితం యునెస్కో ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లాక.. కేంద్రం రామప్పలో రూ.15 కోట్లతో పలు పనులు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏఎస్‌ఐ ఎనిమిది కట్టడాల బాధ్యత చూస్తుంది. కేంద్రం ఒక్కోదాని నిర్వహణ కోసం ఏటా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వేచిస్తుంది. అయితే రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ఏటా రూ.4 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన స్థాయిలో నిధులు ఇస్తే.. రామప్ప రూపురేఖలు మారుతాయి.

కాకతీయ చక్రవర్తి/రాజు గణపతిదేవుడి వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు 1213వ సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని కట్టించాడు. కాకతీయుల సామ్రాజ్యంలో అప్పుడు ఎన్నో అద్భుత ఆలయాల నిర్మాణం జరిగినా రామప్ప ఎంతో ప్రత్యేకమైనది. ఆలయం నిర్మాణంలో ఎక్కువగా ఎర్ర ఇసుకరాయిని ఉపయోగించారు. కీలకమైన ద్వార బంధాలు, స్తంభాలు, పైకప్పు, మదనిక, నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు మాత్రం అత్యంత కఠినమైన బ్లాక్ డోలరైట్(నల్లశానపు) రాయిని వాడారు.
రామప్పకు ఎలా వెళ్లాలి?
- రామప్పకు వెళ్లాలి అనుకునే వారికి మెరుగైన రవాణా సౌకర్యం ఉంది. వరంగల్‌కు 77 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో రామప్ప ఆలయం ఉంది. దీనికి సమీపంలోని శంషాబాద్ ప్రధాన విమానాశ్రయం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు నేరుగా హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా రామప్పకు చేరుకోవచ్చు.
- ఇక రైలు మార్గంలో అయితే వరంగల్ నగరం శివార్లలో ఉన్న కాజీపేట జంక్షన్‌లో దిగాలి. అక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా రామప్పకు చేరుకోవచ్చు.
- బస్సుల ద్వారా అయితే.. వరంగల్ నగరంలోని హన్మకొండ బస్టాండ్‌కు చేరుకోవాలి. అక్కడ ములుగు వెళ్లే బస్సు ఎక్కి వెంకటాపురంలో దిగాలి. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో పాలంపేట (రామప్ప టెంపుల్ ప్రాంతం) ఉంటుంది. ఆటోలు, ప్రైవేటు వాహనాలలో వెళ్ళవచ్చు.
Support Tech Patashala
