ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దళాలు విరుచుకుపడుతున్న సంగతి మనకు తెలిసిందే. గురువారం తెల్లవారుజామున రాజధాని కీవ్‌పై మొదలైన దాడులు చూస్తుండగానే కీలక ప్రాంతాలకు విస్తరించాయి. ఆ దేశంలో ఓ వైపు బాంబుల మోతతో జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. బాంబుల వర్షం కురుస్తుండటంతో తమ స్వంత వాహనాలతో పాటు ఇతర వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు బయల్దేరారు. దీంతో ఆ దేశంలో ఎక్కడ చూసినా భారీ ట్రాఫిక్ జామ్‌లు కన్పించాయి.
కొన్నిచొట్ల పిల్లలను చంకనెత్తుకొని పెద్దవాళ్లను పట్టుకొని వీలైన చోట్లకు జనం పారిపోతూ కనిపించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో ఓ తండ్రి తన కూతురు, భార్యను సురక్షిత ప్రాంతానికి పంపిస్తూ భావోద్వేగానికి లోనైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కూతురిని గుండెకు హత్తుకొని మరి కన్నుల నిండా బాధ, ప్రేమతో ఎంతో ఉద్వేగానికి లోనవుతూ ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
కూతురు బస్సు ఎక్కి వెళ్లిపోతుంటే కూడా తన చేతులను బస్సు అద్దంపై పెట్టి తండ్రి కంటతడి పెట్టుకోవడం మనం చూడొచ్చు. తండ్రి కంటతడి పెట్టడం చూసిన కూతురు, పక్కనే ఉన్న మహిళ కూడా వెంటనే ఏడవటం ప్రారంభించారు. అయితే, వీడియో చూసిన నెటిజన్లు మాత్రం గుండెలు పిండేసేలా ఉందంటూ.. యుద్ధ తీవ్రతకు ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.
(ఇది కూడా చదవండి: అటు బాంబుల మోత.. ఇటు బంగారం, ఫ్యూయల్ ధరల వాత..!)