శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023

ఇజ్రాయిల్, హమాస్(పాలస్తీనా) మధ్య తాజా వివాదానికి గల కారణాలేంటి?

ఇజ్రాయిల్ మీద పాలస్తీనా ఏర్పాటు వాద సంస్థ హమాస్ మే 10నే ఎందుకు దాడులు జరిపింది. పాలస్తీనా కోసం నిజంగానే హమాస్ పోరాడుతుందా? లేదా ఇంకేమైన కారణాలు ఉన్నాయా, అసలు తాజా వివాదానికి గల కారణలేమిటి?. ఈ మరణ హోమనికి ముగింపు లేదా?. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు ఏ కోణంలో ఆలోచిస్తున్నాయి. హమాస్ దగ్గరికీ ఇన్ని వేల రాకెట్లు ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య తాజా దాడులకు 3 కారణాలు అని చెప్పుకోవాలి అవి:
1) అల్-అక్సా మసీదు వివాదం
2) షేక్ జర్రా వివాదం
3) పాలస్తీన ఎన్నికలు

1) అల్-అక్సా మసీదు వివాదం:

ఇజ్రాయిల్ లో హమాస్ మొదటి రాకెట్ ప్రయోగించడానికి సరిగ్గా 27 రోజుల ముందు అంటే ఏప్రిల్ 13 ఆ రోజు రాత్రి ఇజ్రాయిల్ పోలీసు అధికారుల బృందం జెరూసలేంలోని ఇస్లాం మతానికి మూడవ పవిత్ర ప్రదేశమైన అల్-అక్సా మసీదులోకి ప్రవేశించి అక్కడ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో లౌడ్ స్పీకర్ల కేబుల్స్ కట్ చేసింది. ఏప్రిల్ 13 అనేది ముస్లిం పవిత్ర రంజాన్ మాసం మొదటి రోజు. అలాగే, ఆ రోజు ఇజ్రాయెల్‌లో స్మారక దినోత్సవం కూడా. ఆ రోజు వారు తమ దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన వారిని యూదులు స్మరించుకుంటారు.

అందులో భాగంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు మసీదు పక్కన ఉన్న పవిత్ర యూదుల ప్రదేశమైన వెస్ట్రన్ వాల్ వద్ద ప్రసంగిస్తున్నారు. అయితే, ముస్లింలు చేసే ప్రార్థనలు అధ్యక్షుడు చేసే ప్రసంగానికి ఆటంకం కలిగిస్తాయని ఇజ్రాయెల్ అధికారులు భావించారు. ఈ సంఘటనను ఆరుగురు మసీదు అధికారులు ధృవీకరించారు. అయితే ఇజ్రాయిల్ పోలీసులు దీని గురుంచి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ విషయం గురుంచి మాత్రం పెద్దగా బయట ప్రపంచానికి తెలియదు.(ఇది కూడా చదవండి: హమాస్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షిస్తున్న ఉక్కు గొడుగు)

ఇస్లాంలోని పవిత్ర ప్రదేశాలలో ఒకటైన మసీదులోకి పోలీసుల ప్రవేశించిన 27 రోజుల తర్వాత మే 10న గాజా స్ట్రిప్ ను పాలించే తీవ్రవాద భావాలు గల పాలస్తీనా ఏర్పాటు వాద సంస్థ హమాస్ రాకెట్లను ప్రయోగిస్తుందని ఆ రోజు ఎవరు అంచనా వేయలేకపోయారు. అయితే, ఈ రాకెట్ దాడులను నుంచి ఇజ్రాయిల్ దేశాన్ని ఐరన్ డోమ్ అనే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ రక్షించింది. అమెరికా పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెరూసలేం నగరాన్ని ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తించి, అక్కడకి నామమాత్రంగా అమెరికా రాయబార కార్యాలయాన్ని తరలించినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున అశాంతి అనేది చెలరేగలేదు.

మరో వెర్షన్
ఏప్రిల్ 13 రంజాన్ మొదటి రాత్రి అల్-అక్సాలో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతానికి పక్కన ఇజ్రాయిల్ అధ్యక్షుడు రెవెన్ రివ్లిన్ ప్రసంగం చేస్తున్నారు. జోర్డానియన్ ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న మసీదు నాయకత్వం, ఇజ్రాయిల్ అధ్యక్షుడు ప్రసంగం సమయంలో ప్రార్థనలను ప్రసారం చేయకుండా ఉండాలన్న ఇజ్రాయిల్ అభ్యర్థనను తిరస్కరించిందని, ఈ అభ్యర్థనను అమర్యాదకరంగా భావించినట్లు మసీదులోని ఒక ప్రజా వ్యవహారాల అధికారి తెలిపారు. కాబట్టి ఆ రాత్రి, పోలీసులు మసీదులోకి ప్రవేశించి స్పీకర్లను డిస్కనెక్ట్ చేశారు అతను పేర్కొన్నాడు.

ఇజ్రాయిల్ అధ్యక్షుడి ప్రతినిధి మసీదు స్పీకర్లను ఆఫ్ చేయడాన్ని ఖండించారు. అయితే ఈ ఒక్క సంఘటన జరిగితే కొన్ని నెలల్లో మారిచిపోయేవారు. కానీ, ఏప్రిల్ లో జరిగిన అనేక రకాల ఇతర సంఘటనలు ఊహించని విదంగా మలుపు తిరిగాయి. లౌడ్ స్పీకర్ సంఘటన జరిగిన తర్వాత అదే రోజు రాత్రి డమాస్కస్ గేట్ వెలుపల ఉన్న ఒక ప్రముఖ ప్లాజాను మూసివేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇది జెరూసలేం ఓల్డ్ సిటీకి ప్రధాన ప్రవేశ ద్వారాలలో ఒకటి.

జెరూసలేంలో నివసిస్తున్న యువ పాలస్తీనియన్లు సాధారణంగా రంజాన్ సమయంలో రాత్రి పూట అక్కడ ఎక్కువ సమావేశమవుతారు. ఆరోజు రాత్రి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హింస చెలరేగకుండ ఉండటానికి ఆ ప్లాజాను మూసివేసినట్లు ఒక పోలీసు ప్రతినిధి తెలిపారు. యువ పాలస్తీనియన్లు తమకు మరొక అవమానం జరిగిందని వెంటనే నిరసనలకు దిగారు. ఆ రాత్రి సమయంలో పోలీసులు, యువ పాలస్తీనియన్లు మధ్య ఘర్షణలు చేలరేగాయి. ఇది చిలీకీ చిలీకీ పెను తుఫానులా మారింది.

1967 అరబ్-ఇజ్రాయిల్ యుద్ధం కాలంలో ఇజ్రాయిల్ జెరూసలేంను గెలుచుకున్న తర్వాత తూర్పు జెరూసలేంలో ఉన్న చాలా మంది పాలస్తీనా నివాసితులు వలసదారులగా మారిపోయారు. కానీ, అక్కడి ప్రజలు మత్రం ఇప్పటికీ తమ దేశమని భావిస్తారు. ప్రస్తుతం జెరూసలేం నగరం మొత్తం ఇజ్రాయిల్ అధీనంలో ఉంది. తమను క్రమంగా జెరూసలేం నుంచి బయటకు నెట్టివేస్తున్నట్లు చాలామ౦ది పాలస్తీనియన్లు భావిస్తారు.

పోలీసుల దాడి జరిగిన ఒక వార౦ తర్వాత ఏప్రిల్ 21న లెహవా అనే మితవాద యూదా గు౦పుకు చె౦దిన కొంత మ౦ది యూదులు మధ్య జెరూసలేం గుండా “అరబ్బులకు మరణ౦” అని అరుస్తూ పాలస్తీనా బాటసారులపై, అనేక మందిపై దాడి చేశారు. అక్కడ ఉన్న విదేశీ దౌత్యఅధికారులు, అనేక కమ్యూనిటీ నాయకులు ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని జెరూసలేంలో జరుగుతున్న ఉద్రిక్తతలను ఆపడానికి ప్రయత్నించారు. కానీ అవి విపలమయ్యాయి. ఏప్రిల్ అంతటా రోజు రోజుకి నిరసనలు ఇరు వైపులా నుంచి పెరిగాయి. ఒకవైపు అల్-అక్సా మసీదులో పరిస్థితి ఇలా ఉంటే, మరో వైపు షేక్ జర్రాలో పరిస్థితి వేరేలా ఉంది.

షేక్ జర్రా వివాదం:

తూర్పు జెరూసలేం శివారుల్లోని షేక్‌ జర్రా, సిల్వాన్‌ ప్రాంతాల్లోని పాలస్తీనీయుల నివాసాలను ఇజ్రాయెలీస్‌ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో తాజాగా ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ భూవివాదం గత 150 ఏండ్ల క్రితం మొదలైంది. 1876లో ఇక్కడి భూములను యూదులు కొనుగోలు చేశారు. కానీ, 1876 తర్వాత జోర్డాన్‌ ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది. అనంతరం ఈ ప్రాంతాల్లో పాలస్తీనీయులు వచ్చి స్థిరపడ్డారు.

1948లో చారిత్రాత్మక పాలస్తీనాలో ఇజ్రాయిల్ రాజ్యం ఏర్పడినప్పుడు లక్షలాది మంది పాలస్తీనియన్లు తమ ఇళ్ల నుంచి బలవంతంగా బయటకు పంపబడ్డారు. ఆ పాలస్తీనా కుటుంబాలలో ఇరవై ఎనిమిది మంది అక్కడే స్థిరపడటానికి తూర్పు జెరూసలేంలోని షేక్ జర్రాకు వెళ్లారు. 1956లో తూర్పు జెరూసలేం జోర్డాన్ పాలనలో ఉన్నప్పుడు జోర్డానియన్ మినిస్ట్రీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ అండ్ డెవలప్ మెంట్, యుఎన్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ షేక్ జర్రాలో ఈ కుటుంబాల కోసం కొన్ని ఇళ్ల నిర్మాణలకు అవకాశం కల్పించింది.

కానీ 1967లో జరిగిన యుద్దంలో ఇజ్రాయిల్ జోర్డాన్ నుంచి తూర్పు జెరూసలేంను మే 10న స్వాధీనం చేసుకుంది. 1970 ప్రారంభం నాటికి, యూదు ఏజెన్సీలు ఆ కుటుంబాలను తమ భూమిని విడిచిపెట్టాలని డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ఇక ఈ ఏడాది (2021) ప్రారంభంలో, తూర్పు జెరూసలేంలోని సెంట్రల్ కోర్టు ఈ భూములు యూదులకే చెందుతాయని వారికి అనుకూలంగా తీర్పునిస్తూ షేక్ జర్రాలోని ఆరు పాలస్తీనా కుటుంబాలను ఇళ్లను ఖాళీ చేసి వెళ్లి పోవాలని ఆదేశించింది. ఇప్పుడు ఆ భూములను స్వాధీనం చేసుకొనే అంశంపై పాలస్తీనీయులకు, ఇజ్రాయెలీయులకు మధ్య ఘర్షణ మొదలైంది. అలా ఇది కూడా చిలీకీ చీలికీ కూడా పెను తుఫానులా మారింది.

పాలస్తీనా ఎన్నికలు:

ఒకవైపు కరోనా వైరస్ మహమ్మరిని అరికట్టడానికి గాజా కష్టపడుతుంటే. హమాస్ తో సహా చాలా ప్రధాన పాలస్తీనా రాజకీయ వర్గాలు 2021 ఏప్రిల్ లో జరగబోయే పాలస్తీనా శాసన సభ ఎన్నికల గురుంచి ఆలోచిస్తున్నాయి. అయితే, ఏప్రిల్ నెలలో షేక్ జర్రా, అల్-అక్సా మసీదులో చెలరేగిన ఈ ఘర్షణ వల్ల ఏప్రిల్ 29న వెస్ట్ బ్యాంక్ లో అధికారంలో ఉన్న పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తాము ఒడిపోతామనే భయంతో పాలస్తీనా ఎన్నికలను రద్దు చేశారు.

ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అబ్బాస్ బలహీనంగా ఉన్నాడని హమాస్ గమనించింది. జెరూసలేం మిలిటెంట్ డిఫెండర్ గా తనను తాను భావించింది. అయితే, ఇజ్రాయిల్ దిగ్బంధం తర్వాత గత 15 సంవత్సరాలలో ఎప్పుడు లేనంతగా గాజాలో నిరుద్యోగ రేటు 50 శాతానికి చేరుకుంది. పాలస్తీనియన్లు యుద్ధం కంటే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం గురించి ఎక్కువగా మాట్లాడటంతో గాజాలో హమాస్ కు రోజు రోజుకి ప్రజాదరణ చాలా తగ్గిపోయింది.

వెస్ట్ బ్యాంక్ ప్రజలు, అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ శాంతి యుతంగా పాలస్తీనా సాదించుకోవాలి అని చూస్తారు. కానీ, హమాస్ మాత్రం హింస ద్వారా పాలస్తీనా సాదించాలని చూస్తుంది. అయితే, ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా హమాస్ కు ఏప్రిల్ జెరూసలేంలో ఏర్పడిన ఘర్షణలు భాగ కలిసి వచ్చాయి. 1967లో మే 10న జెరూసలేం తూర్పు సగాన్ని ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది. అదే రోజు ఈ ఏడాది మే 10 సాయంత్రం 6 నుంచి 8 ప్రాంతంలో మొదటి రాకెట్ ను గాజా నుంచి హమాస్ ప్రయోగించింది.(ఇది కూడా చదవండి: హమాస్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షిస్తున్న ఉక్కు గొడుగు)

ఇలా ఏప్రిల్ లో జరిగిన అనేక ఘర్షణలు ఈ వివాదానికి కరణమయ్యాయి. ముఖ్యంగా అల్-అక్సా మసీదు, షేక్ జర్రా ప్రాంతంలో చెలరిగిన ఘర్షణలు దీనికి ఆద్యం పోసాయని చెప్పుకోవాలి. అయితే ఇంత చిన్న గాజా ప్రాంతంలోకి రాకెట్లు ఎలా వచ్చాయి, ఎవరు పంపించారు అనేది అందరినీ తొలిస్తున్న ప్రధాన ప్రశ్న. గాజాలో ఉన్న హమాస్ ఉగ్రవాద భావాలు గల పాలస్తీనా ఏర్పాటు వాద సంస్థకు ఇరాన్ ఆయుదాలను ఈజిప్ట్ ప్రాంతం నుంచి పంపిస్తుంది. భూగర్భంలో ఏర్పాటు చేసిన సొరంగా మార్గాల నుంచి ఈ ఆయుదాలను సరఫరా చేస్తుంది.

అయితే దీనికి ఎటువంటి శాశ్వత పరిష్కారం లేదా అంటే ఉంది. మొదటి ఆప్షన్ ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ, యునెస్కో పేర్కొన్నట్లు జెరూసలేంని తన అధీనంలో ఉంచుకొని మిగతా ప్రాంతాలను పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాలుగా గుర్తించడం. మరొక ఆప్షన్ మొత్తం పాలస్తీనా దేశంగా గుర్తించడం(దీని వల్ల మూడవ ప్రపంచ యుద్దం వచ్చే అవకాశం ఉంది. ఇక చివరి ఆప్షన్ మొత్తం ఆ ప్రాంతాన్ని ఇజ్రాయిల్ దేశంగా గుర్తించడం. అన్నిటికంటే మొదటిదే ఉత్తమమని అనేక ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అందులో ఇండియా కూడా ఉంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

Telugu