గత కొద్దిరోజుల నుంచి ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌లో ఏర్పడిన సమస్యలతో పన్ను చెల్లింపుదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కోంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌లో తలెత్తిన సమస్యలను సెప్టెంబర్ 15లోపు పరిష్కరించాలని కేంద్రం, ఇన్ఫోసిస్ ను హెచ్చరించిన కూడా ఇంకా ప్రజలను సమస్యలు వెంటాడుతున్నాయి.
దీంతో, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. పాన్ – ఆధార్ కార్డ్‌తో లింక్ గడువు చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది.
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే గడువును 2022 మార్చి 31 వరకు పెంచింది. దీనికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఒక కీలక ప్రకటనను విడుదల చేసింది. పాన్ – ఆధార్ కార్డు లింక్ గడువును పొడిగించడం ఇది నాలుగో సారి. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆర్ధిక బిల్లులో ప్రభుత్వం కొన్ని సవరణలను చేసింది. కొత్త నిబందనల ప్రకారం ఒక వ్యక్తి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే రూ.1000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.(చదవండి: 10 నిమిషాల్లో పాన్ కార్డును ఉచితంగా పొందండి ఇలా)
మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇలా లింక్ చేయండి..
- ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/కి ఓపెన్ చేయండి.
- ‘లింక్ ఆధార్’ ఆప్షన్‌పై మీద క్లిక్ చేయండి.
- సంబంధిత ఫీల్డ్‌లలో పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పూర్తి పేరునమోదు చేయాలి.
- ఆ తర్వాత మీ ఆధార్ కార్డు కేవలం పుట్టిన సంవత్సరం ఉంటే దాన్ని టిక్ చేయాల్సి ఉంటుంది.
- క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి, పేజీ దిగువన ఉన్న ‘లింక్ ఆధార్’ బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత మీ మొబైల్ నెంబరుకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేసి ‘వాలిడేట్’ మీద క్లిక్ చేయండి.
- మీ పాన్ కార్డు – ఆధార్ వివరాలు ఒకే విధంగా ఉంటే విజయవంతం అయినట్లు ఒక పాప్ అప్ సందేశం కనిపిస్తుంది.