Evaru Meelo Koteeswarulu: కొత్తగూడెం పట్టణానికి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజారవీంద్ర ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొని జూనియర్ ఎన్టీఆర్ అడిగిన 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకున్న సంగతి మనకు తేలిసిందే. రాజారవీంద్ర ప్రైజ్ మనీ గెలిచిన ఎపిసోడ్ సోమ, మంగళ వారాల్లో రాత్రి 8.30 గంటలకు ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యింది. ఖమ్మం జిల్లా సుజాతనగర్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్.ఎస్ రాజు, శేషుకుమారి దంపతుల సంతానం రవీంద్ర. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్ కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు.
2000-2004 మధ్య హైదరాబాద్‌లోని వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్, బ్యాంకుతో పాటు ఇతర ఉద్యోగాలు కూడా చేశారు. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా 2012లో పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం సంపాదించారు. అయితే, ఇంత వరకు భాగానే ఉన్న ఎవరు మీలో కోటీశ్వరులు పాల్గొని కోటి రూపాయలు గెలుచుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజారవీంద్రకు దక్కేది మాత్రం తక్కువ అని సోషల్ మీడియాలో ప్రజలు కామెంట్ చేస్తున్నారు.
(చదవండి: ఒక్కరోజులో కోటీశ్వరులైన పేటీఎం ఉద్యోగులు)
అయితే, అది ఎంత వరకు నిజమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా షోలో పాల్గొని ప్రైజ్ మనీ రూ.10,000 మించి గనుక గెలిస్తే అతడు కచ్చితంగా ఆ డబ్బు మీద ట్యాక్స్ చెల్లిచాల్సి ఉంటుంది. గెలిచిన డబ్బుపై ఐటీ యు/ఎస్ 194బి చట్టం ప్రకారం 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎవరు మీలో కోటీశ్వరులలో కోటి గెలిచిన విజేతకు వచ్చేది రూ.68,80,000 మాత్రమే. మిగతా రూ.31,20,000 వేలు పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూటర్ చెల్లింపు సమయంలో ఈ పన్ను మినహాయించి డబ్బు చెల్లిస్తారు.