పీఎం కిసాన్ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ ఈ-కేవైసీ గడువును పొడగిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 31 వరకు ఈ-కేవైసీ గడువు తేదీని మే 22, 2022కి పొడగించినట్లు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ ద్వారా తెలిపింది. పొడగించిన గడువు తేదీలోగా రైతులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని, లేకపోతే రూ.6 వేలను ఖాతాలో జమ చేయమని వివరించింది.
పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులు ఖచ్చితంగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి అని పేర్కొంది. ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులకే డబ్బులు వస్తాయి.11వ విడతకు సంబందించి ఈసారి అర్హులైన వారందరికీ డబ్బులు వస్తాయి. వచ్చే విడత నుంచి మాత్రం ఈ-కేవైసీ పూర్తిచేసిన వారికే డబ్బులు జమచేయనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 11వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
ఏప్రిల్ చివరి వరకు రైతుల ఖాతాల్లోకి రూ.2,000 జమకానున్నాయి. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM KISAN) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ప్రతి ఏడాది రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఖాతాల్లో వేస్తున్నారు.