Rythu Bima Scheme Full Details in Telugu: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు రైతు బీమా పేరుతో వినూత్న పథకాన్ని రూపొందించి అమలు చేస్తోంది. ఏ కారణం చేతనైనా రైతు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబ సభ్యులు, అతని/ఆమెపై ఆధారపడిన వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే రైతుబీమా పథకం ముఖ్య ఉద్దేశం.
ఈ పథకం కింద నమోదైన రైతు ఏ కారణంతో మరణించిన ఆ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్మును ఎల్ఐసీ అందిస్తోంది. తొలి ఏడాదిలో ప్రతి రైతు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీకి రూ.2,271 చొప్పున చెల్లించగా.. గతేడాది రూ.3,556 చొప్పున ప్రీమియం చెల్లించింది.
(ఇది కూడా చదవండి: తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంతో తెలుసా..?)
ఈ పథకం బాధిత కుటుంబాల జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది.. వారి జీవనోపాధికి సహాయపడుతుంది, ఎందుకంటే వారిలో ఎక్కువ మంది పేద చిన్న రైతులు.. సమాజంలోని బలహీన వర్గాలకు చెందినవారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే.. క్లెయిమ్ మొత్తాన్ని సెటిల్ చేసుకోవడానికి నామినీ ఏ కార్యాలయాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు.
మండల స్థాయిలోని వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైనా రైతు ప్రాణాలు కోల్పోతే రెవెన్యూ శాఖ నుంచి వివరాలు సేకరించి రైతు నామినేటెడ్ నామినీ తరఫున ఎల్ఐసీకి సమర్పిస్తారు. క్లెయిమ్ చేసిన మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా నామినీల ఖాతాలోకి బదిలీ చేస్తారు.
రైతు బీమా పథకం దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు:
- 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు వయసున్నవారు మాత్రమే ఈ పథకంలో పేరు నమోదు చేసేందుకు అర్హులు.
- కొత్తగా వ్యవసాయ భూమి కొన్న రైతులు ఈ పథకంలో చేరవచ్చు
- ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారిని, చనిపోయినవారి పేర్లను పథకంలోనుంచి తొలగించి నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారివి ఈ పథకంలో చేరుస్తున్నారు.
- ఇప్పటికే ఈ పథకంలో నమోదైనవారు నూతనంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు.
- ఏఈవోల వద్ద ఆయా గ్రామాల జాబితాలుండగా పేరు నమోదుచేసే రైతు స్థానికంగా ఉండాలి.
రైతు భీమా స్థితిని/స్టేటస్ ఎలా తనిఖీ చేయాలి?
- నామినీ రైతు భీమా కింద క్లెయిమ్ చేసుకున్న తర్వాత 10 రోజులలో రూ.5 లక్షలు బ్యాంకు ఖాతాలో పడుతాయి. అలా మీ ఖాతాలో నగదు జమ కాకపోతే మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఎల్ఐసి సందర్శించి
- భీమా డబ్బు కోసం మీ స్థితిని తనిఖీ చేయవచ్చు. సాధారణ కారణాలతో రైతు మరణించిన బీమా క్లెయిమ్ను వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నట్లు ఎల్ఐసీ సంబంధిత అధికారులు చెబుతున్నారు.
రైతు బీమా పథకంలో పేరు నమోదు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
- రైతు బీమా పథకం కింద రైతులు తమ పేరు నమోదు చేసుకోవడానికి మొదట మీ మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సందర్శించండి.
- ఆ తర్వాత వ్యవసాయ శాఖ అధికారి ఇచ్చిన దరఖాస్తు ఫారంలో మీ పేరు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, రైతుతోపాటు నామినీ ఆధార్‌కార్డుల నకలు ప్రతులను, నామినీ నమోదు పత్రాన్ని పూరించి ఏఈవోలకు ఇవ్వాలి.
- చట్టపరమైన వారసత్వం కలిగినవారు నామినీగా ఉండాలి. గతంలో పథకంలోని రైతుల పేరిట నమోదైన నామినీ చనిపోతే నామినీ పేరు మార్పునకు అవకాశం ఉంటుంది.
ఈ బీమా సర్టిఫికెట్/దరఖాస్తు ఫారం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి..?
- ఈ బీమా సర్టిఫికెట్/దరఖాస్తు ఫారం కోసం మీ మీ మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సందర్శించండి.
రైతు బీమా పథకం క్లెయిమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
- దురదృష్టవశాత్తూ రైతు మరణిస్తే నామినీ బీమా పథకం క్లెయిమ్ ఫారంలో రైతు పేరు, చిరునామా, ఏ తేదీన మరణించారు, ఎప్పుడు ఈ పతాకంలో పేరు నమోదు చేసుకున్నారు, ఆధార్ నెంబర్, పట్టాదార్ పాస్ బుక్ నెంబర్ నమోదు చేయాలి.
- ఆ తర్వాత నామినీ పేరు, మరణించిన రైతుతో నామినీ గల సంబంధం, ఆధార్ నెంబర్, చిరునామా వివరాలు నమోదు చేయాలి.
- అలాగే, బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎస్సీఎస్ కోడ్ వివరాలు నమోదు చేసి ఏఈవో అధికారికి సమర్పించాలి.