How To Apply For Kisan Credit Card: కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు సులువుగా రుణాలు అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(Kisan Credit Card) సౌకర్యాన్ని కల్పించిన సంగతి మనకు తెలిసిందే. రైతులు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు సహాయంతో సులువుగా వ్యవసాయ రుణాలు(Agriculture Loans) తీసుకోవచ్చు. గడువులోగా తీసుకున్న రుణాలను చెల్లించిన వారికి వడ్డీపై సబ్సిడీ కూడా లభిస్తుంది.
రైతులు గతంలో రుణాల తీసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. వడ్డీ వ్యాపారుల నుంచి ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని ఆర్థికంగా చాలా ఇబ్బందులు గురి అయ్యేవారు. రైతులను ఈ కష్టాల నుంచి తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది.
కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు:
రైతు యజమానులు, ఉమ్మడిగా వ్యవసాయం చేసే రైతులు, కౌలు రైతులు, స్వయం సహాయక బృందాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్‌లు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.3 లక్షల వరకు ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న రైతులకు బ్యాంకులు ఎక్కువ రుణాలు కూడా అందిస్తాయి. బ్యాంకులను బట్టి వడ్డీ రేటు మారుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి.
(ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో రేషన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..?)
కిసాన్ క్రెడిట్ కార్డు కనీస వడ్డీ రేటు 7 శాతం. అయితే, సకాలంలో రుణం తిరిగి చెల్లించిన వారికి వడ్డీపై 3 శాతం వరకు రాయితీ కూడా లభిస్తుంది. ఐదేళ్ల లోపు తీసుకున్న రుణాలు చెల్లించవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌లో చేరినవారికి రూపే డెబిట్ కార్డ్ కూడా లభిస్తుంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లిస్తే పంటలకు బీమా కూడా లభిస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- మీరు మీ దగ్గరలోని బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్ళాలి.
- ఆ తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం కావాల్సిన దృవ పత్రాలను బ్యాంకు మేనేజర్కి సమర్పించాలి.
- మీరు అన్నీ విధాలుగా మీరు అర్హులు అయితే బ్యాంకు సిబ్బంది నుంచి కాల్ వస్తుంది.
- ఆ తర్వాత నెల రోజుల లోపు మీకు కార్డు ఇంటికి లేదా బ్యాంకుకు వస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
- దరఖాస్తు ఫారం.
- రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు.
- డ్రైవింగ్ లైసెన్స్ / ఆధార్ కార్డ్ / ఓటరు గుర్తింపు కార్డు / పాస్‌పోర్ట్ మొదలైన IDలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించాలి.
- డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ మొదలైన చిరునామా రుజువు.
- రెవెన్యూ అధికారులచే సక్రమంగా ధృవీకరించబడిన భూమికి సంబంధించిన రుజువు.
- వర్తించే విధంగా రూ.1.60 లక్షలు / రూ.3.00 లక్షల కంటే ఎక్కువ రుణ పరిమితి కోసం భద్రతా పత్రాలు.
- రుణం కోసం ఇంకా బ్యాంకు అధికారులు కోరిన ఇతర పత్రాలు సమర్పించాలి.