World’s First Bajaj CNG Bike Details in Telugu: ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ(CNG) బైక్‌ను దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో(Bajaj Auto) విడుదల చేసింది. ఫ్రీడమ్ 125(Freedom 125) పేరుతో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైకును లాంచ్ చేసింది. బజాజ్ సంస్థ నిర్వహించిన లాంచ్ కార్యక్రమానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా హాజరయ్యారు. సీఎన్‌జీతో పాటు పెట్రోల్‌తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంక్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.
ఈ ఫ్రీడమ్ 125 బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రీడమ్ 125(Freedom 125) డిస్క్ ఎల్‌ఈడీ(NG04 Disc LED), ఫ్రీడమ్ డ్రమ్ ఎల్‌ఈడీ(NG04 Drum LED), ఫ్రీడమ్ డ్రమ్(NG04 Drum) వేరియంట్లలో ఈ బైక్ లభిస్తుందని బజాజ్ ఆటో పేర్కొంది. డ్యూయల్ టోన్ కలర్‌తో ఏడు రంగుల్లో ఈ బైక్ లభిస్తుందని తెలిపింది.
ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ ధరలు:
- NG04 Disc LED వేరియంట్ ధర: రూ.1.10 లక్షలు
- NG04 Drum LED వేరియంట్ ధర: రూ.1.05 లక్షలు
- NG04 Drum వేరియంట్ ధర: రూ.95 వేలు
ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ ఫీచర్స్:
125 సీసీ ఇంజిన్ కలిగిన ఫ్రీడమ్ 125లో 2 కేజీల సీఎన్‌జీ ట్యాంక్, 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది. సీఎన్‌జీ 2 కేజీలకు 200 కిలోమీటర్లు, పెట్రోల్ రెండు లీటర్లకు 130 కిలోమీటర్లు (లీటర్‌కు 65 కి.మీ.) కలిపి 330 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఇంజిన్ 9.5 పీఎస్ పవర్, 9.7 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ తెలిపింది. సీఎన్‌జీపై టాప్‌స్పీడ్ గంటకు 90.5 కిలోమీటర్ల, పెట్రోల్‌పై టాప్ స్పీడ్ 93.4 కిలోమీటర్లు వెళ్ళవచ్చు కంపెనీ పేర్కొంది. సీఎన్‌జీ, పెట్రోల్ ట్యాంక్‌లను సీటు కింద అమర్చారు.
ఈ బైక్ 11 రకాల సేఫ్టీ టెస్టుల్లో పాస్ అయినట్లు కంపెనీ తెలిపింది. ప్రమాదాలు జరిగినప్పుడు సీఎన్‌జీ లీక్ కాకుండా భద్రతా పరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. సాధారణ పెట్రోల్ బైక్‌తో పోలిస్తే 50 శాతం తక్కువ ఆపరేటింగ్ ఖర్చుతో ఈ బైక్ నడుస్తుందని, కేవలం ఐదేళ్లలోనే రూ.75వేల వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. సీఎన్‌జీ, పెట్రోల్ మోడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చని కంపెనీ తెలిపింది.
బైక్‌ను ఆపకుండానే ఫ్యూయెల్ ఆప్షన్‌ను మార్చుకోవచ్చని కూడా పేర్కొంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కన్సోల్, మోనో షాక్ సస్పెన్షన్, పొడవైన సీటుతో ఈ బైక్ వచ్చింది. ఎల్‌ఈడీ రౌండ్ హెడ్‌ల్యాప్ అమర్చారు. బైక్ బుకింగ్‌లు తమ వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయని పేర్కొంది. మహారాష్ట్ర, గుజరాత్‌లో తక్షణమే తీసుకొస్తామని, ఇతర రాష్ట్రాల్లో దశలవారీగా ఈ బైక్‌లను అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు కంపెనీ తెలిపింది.