మీరు కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులను ప్రధానంగా వేదిస్తున్న సమస్యలకు చెక్ పెట్టె కొత్త సాంకేతికత వచ్చేసింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లకు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టిన కూడా గంటల సమయం పట్టేది. ఇక నుంచి ఆ సమస్య ఉండదు. కొత్తగా వచ్చిన టెక్నాలజీ వల్ల పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయడానికి పట్టే సమయం కంటే తక్కువ సమయంలోనే ఇక ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
స్విస్ కు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ ఏబీబీ ఒక సృజనాత్మక గల ఆల్-ఇన్-వన్ ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) ఛార్జర్ను ప్రారంభించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ చార్జర్ ను”టెర్రా 360(Terra 360)” ఏబీబీ లాంచ్ చేసింది. ఈ చార్జర్ పాయింట్ వద్ద ఒకేసారి నాలుగు కార్లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఛార్జర్ గరిష్టంగా 360 కిలోవాట్లు విద్యుత్ సరఫరా చేస్తుంది. అందుకే, 15 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో 500 కిలో మీటర్లు వెళ్ళే ఏదైనా ఎలక్ట్రిక్ కారును ఫుల్ ఛార్జ్ చేయగలదు.
(చదవండి: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. వరల్డ్ రికార్డు రేంజ్ 480 కి.మీ)
ఇప్పుడు ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం వల్ల కనీసం 2-3 గంటల సమయం పడుతుంది. ఈ టెర్రా 360 ఛార్జింగ్ పాయింట్ వద్ద 3 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే కారు 100 కిమీ వెళ్లనుంది. 2021 చివరి నుంచి ఐరోపాలో, 2022లో యుఎస్ఎ, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకొని రానున్నారు. టెర్రా 360 ఈవీ డ్రైవర్ల రోజువారీ అవసరాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. ఏబీబీ ఈ-మొబిలిటీ ఎలక్ట్రిక్ వేహికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో ప్రపంచ అగ్రగామిగా ఉంది.
ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ – హైబ్రిడ్ బస్సులు, వ్యాన్లు, ట్రక్కులు, ఓడలు, రైల్వేలకు పూర్తి స్థాయి ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సమస్యలకు పరిష్కారాలను కనుగొంటుంది. ఏబీబీ 2010లో ఈ-మొబిలిటీ మార్కెట్లోకి ప్రవేశించింది. నేడు 88 కంటే ఎక్కువ మార్కెట్లలో 460,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహన ఛార్జర్లను విక్రయించింది. ఇందులో 21,000కు పైగా డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, 440,000 ఏసీ ఛార్జర్లు ఉన్నాయి.