ఒక్క రోజులో జాతకాలను మార్చే శక్తి ప్రస్తుత ప్రపంచంలో స్టాక్ మార్కెట్ కు ఉందని చెప్పుకోవాలి. ఈ స్టాక్ మార్కెట్ వల్ల వారాల వ్యవదిలో ప్రపంచ కుబేరుల జాబితా తలక్రిందులు అవుతుంది. అలాంటి స్టాక్ మార్కెట్ వల్ల ఒక కంపెనీకి చెందిన 500 మంది ఉద్యోగులు ఒక్కరోజులో కోటీశ్వరులు అయ్యారు. కొద్ది రోజుల క్రితం భారత సంతతికి చెందిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ సంస్థ నాస్‌డాక్‌లో లిస్టింగ్ చేసిన ఒక్కరోజులోనే కంపెనీల షేర్లు విలువ 32 శాతం మేర పెరిగాయి. దీంతో నాస్‌డాక్ ట్రేడింగ్‌లో ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ షేర్లు 47.55 డాలర్ల వద్ద ముగిశాయి.
కంపెనీ షేర్ల విలువ పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 13 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో, ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన సుమారు 500 మంది భారతీయ ఉద్యోగులు ఒక్కరోజులోనే కోటీశ్వరులైనట్లు కంపెనీ వ్యవస్థాపకుడు గిరీష్ మాతృబూతం వెల్లడించారు. అందులో సుమారు 70 మంది ఉద్యోగులు 30 ఏళ్ల లోపు వారే. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా సుమారు 4300 ఉద్యోగులున్నారు. సుమారు 76 శాతం మంది ఉద్యోగులు ఫ్రెష్‌వర్క్స్ షేర్లను కలిగి ఉన్నారు. నాస్‌డాక్ స్టాక్‌ఎక్స్‌చేంజ్‌లో లిస్టింగ్ చేసిన భారతీయ సాఫ్ట్‌వేర్ సంస్థగా ఫ్రెష్‌వర్క్ నిలిచింది. ఫ్రెష్ వర్క్స్ సంస్థను 2010లో భారత్‌లో గిరీష్ మాతృబూతం, షాన్ కృష్ణసామి స్థాపించారు.(చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ బంపర్ ఆఫర్!)